ప్రముఖ నటి సమంత తన భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుపై ప్రశంసలు కురిపించారు. వీరిద్దరూ గత ఏడాది డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో అత్యంత నిరాడంబరంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్లలో భాగంగా సమంత మాట్లాడుతూ.. రాజ్ ఒక అద్భుతమైన క్రియేటర్ అని, తన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
గతంలో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి విజయవంతమైన ప్రాజెక్టుల కోసం కలిసి పనిచేసిన ఈ జంట, ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో నిర్మాతలుగా మారారు. సమంత సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పై రాజ్ నిడిమోరు మరియు హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక సాధారణ గృహిణి శక్తివంతమైన మహిళగా ఎలా ఎదిగిందనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతోంది.
వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత సమంత-రాజ్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో సినీ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్’గా రూపొందుతున్న ఈ మూవీ మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. వృత్తిపరంగా రాజ్ మేధస్సును, వ్యక్తిగతంగా ఆయన తోడ్పాటును సమంత గౌరవిస్తున్న తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.









