జార్ఖండ్ రాజధాని రాంచీలో రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ JPSC, JSSC అభ్యర్థులు చేపట్టిన ‘అసెంబ్లీ మార్చ్’ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేలాది మంది అభ్యర్థులు అసెంబ్లీ వైపు కదిలేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. జగన్నాథ్‌పూర్ ఆలయం సమీపంలోని చివరి బారికేడ్‌ను దాటేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీఛార్జ్‌తో పాటు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు అభ్యర్థులు గాయపడినట్లు సమాచారం. మరోవైపు, పోలీసుల చర్యల మధ్య కొంతమంది విద్యార్థులు నిరసన స్థలంలోనే నృత్యాలు చేస్తూ వినూత్నంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.
ఈ పరిణామాల మధ్య జార్ఖండ్ సీఐడీ నియామక పరీక్షల అక్రమాల కేసులో కీలక చర్యలు చేపట్టింది. JPSC మాజీ చైర్మన్ ఎల్. ఖియాంగ్తేను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. జులై 22న తన పదవికి రాజీనామా చేసిన ఖియాంగ్తేను సీఐడీ అధికారులు ఇప్పటికే నాలుగుసార్లు విచారించినట్లు తెలుస్తోంది. తాజా అరెస్టుతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 20కి చేరింది. దీనికి ఒకరోజు ముందే JPSCకి చెందిన ముగ్గురు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు, తొమ్మిది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న JLKమ్ నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో సైతం అంబులెన్స్‌లోనే అసెంబ్లీ మార్చ్‌లో పాల్గొన్నారు. దీక్ష కారణంగా ఆయన 10.5 కిలోల బరువు తగ్గినట్లు ఆందోళనకారులు తెలిపారు. మొత్తం 13 నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న అభ్యర్థులు.. ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.









