– ప్రొరేటా ప్రకారం అంతర్రాష్ట్ర జలాల విడుదలపై చర్చించాలి- ఎగువ రాష్ట్రాలతో సమన్వయం చేసుకోండి
– వర్షా కాలంలోపు డ్యామ్‌ల గేట్ల మరమ్మతులు పూర్తి చేయాలి
– పంట మార్పిడి.. పంటల వైవిధ్యతపై అవగాహన కల్పించండి
– నగరంలో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మాణాలు పూర్తి కావాలి
– సమస్యల పరిష్కారంలో కలెక్టర్లు, ఎస్పీల మధ్య సమన్వయం అవసరం
– వర్షాకాల సన్నద్ధత సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 1 : ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావారణ శాఖ నివేదిస్తున్నందున కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా దక్కేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎగువ రాష్ట్రాలు డ్యామ్‌లు నిండిన తర్వాతే నీళ్లు వదిలే విధానాన్ని పాటిస్తే మనకు ఇబ్బందులు ఎదురవుతాయనిన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొనేలా ఉన్నందున అంతరాష్ట్ర జలాల్లో ప్రొరేటా ప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటా వచ్చేలా ఆయా రాష్ట్రాల అధికారులతో ముందుగానే చర్చించి తగిన కార్యాచరణ రూపొందించాలని సీఎం నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. వర్షాకాల సన్నద్ధతపై సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. కోయనా డ్యామ్ నీటిని వంద శాతం జల విద్యుదత్పత్తికే మహారాష్ట్ర వినియోగిస్తోందని, ఆ మొత్తం నీటిని మనం తీసుకుని వారికి అవసరమైన విద్యుత్ సరఫరా చేయడంపై ఆ రాష్ట్ర అధికారులతో చర్చించాలని సీఎస్ రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. గోదావరి నది నుంచి ఏటా వేల టీఎంసీల జలాలు సముద్రం పాలవుతున్నాయని, అయితే ఆ వరదంతా చాలా స్వల్ప కాలంలోనే వస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో ఇటు గోదావరి, అటు ప్రాణహితల వైపు నుంచి వచ్చే వరదను ఎలా మళ్లించాలనే దానిపై స్పష్టమైన విధానం రూపొందించాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నిర్మించిన సీలేరు, తుంగభద్ర డ్యామ్‌ల నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో తెలంగాణకు రావాల్సిన వాటాపై నివేదిక రూపొందించాలని విద్యుత్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌ల గేట్ల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలంటూ డ్యామ్‌ల నిర్వuహణపై ముఖ్యమంత్రి అధికారులను ఆరా తీశారు. గతంలో కడెం ప్రాజెక్టులో తలెత్తిన ఇబ్బందులను గుర్తు చేశారు. గేట్ల మరమ్మతులు, మెయింటెనెన్స్‌కు సంబంధించి ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేశామని ఆర్థిక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఎన్ని నిధులు అవసరమైనా వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఈ వర్షాకాలంలో ఎక్కడైనా డ్యామ్‌ల విషయంలో ఇబ్బందులు తలెత్తితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.









