భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రధాన కార్యాలయంలో గురువారం బాంబు బెదిరింపు కలకలం రేపింది. బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి ఈమెయిల్ ద్వారా వచ్చిన ఈ బెదిరింపు నకిలీదని పోలీసులు నిర్ధారించారు. దీంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ఇస్రో కేంద్రంలోని చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ కార్యాలయానికి ఈ బెదిరింపు మెయిల్ అందింది. వెంటనే అప్రమత్తమైన ఇస్రో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా ప్రాంగణాన్ని ఖాళీ చేయించి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు కానీ, అనుమానాస్పద వస్తువులు కానీ లభ్యం కాలేదని అధికారులు స్పష్టం చేశారు.
బాంబు బెదిరింపుపై పోలీసులు కేసు నమోదు చేసి, ఈ-మెయిల్ పంపిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఇస్రో కార్యాలయంలో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల దేశంలోని పలు కీలక సంస్థలకు ఇలాంటి నకిలీ బెదిరింపులు వస్తున్న నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. జూన్ 29న ఎన్‌ఐఏ, డీఆర్‌డీఓ వంటి సంస్థలకు బెదిరింపు ఈ-మెయిళ్లు పంపిన కేసులో ఢిల్లీ పోలీసులు ఘజియాబాద్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.









