ఆక్వా రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి: “చంద్రబాబు సిండికేటే రాష్ట్రాన్ని నడిపిస్తోంది” అంటూ తీవ్ర విమర్శలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో ఆక్వా రంగం తీవ్రమైన సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని, ఆక్వా రైతులు గిట్టుబాటు ధరలు లేక దీనావస్థను ఎదుర్కొంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన ఆక్వా రైతుల ముఖాముఖి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆక్వా ఫీడ్, సీడ్ ధరలను ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతున్నారని, ఈ ధరల పెరుగుదలకు ఎలాంటి హేతుబద్ధత లేదని మండిపడ్డారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లభించట్లేదని, రైతుల సమస్యలపై ప్రస్తుత ప్రభుత్వ తీరు దున్నపోతు మీద వాన పడినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఆక్వా రంగాన్ని చంద్రబాబు నాయుడు తన మనుషులతో దోచుకుంటున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు సానుభూతిపరులే ఒక సిండికేట్‌గా ఏర్పడి మార్కెట్‌లో ఫీడ్, సీడ్ రేట్లను నిర్ణయిస్తున్నారని, ఈ చంద్రబాబు సిండికేటే రాష్ట్రాన్ని నడిపిస్తోందని విమర్శించారు. గతంలో ఫీడ్ ధరలను కేజీకి రూ. 14 నుండి రూ. 16 వరకు విపరీతంగా పెంచేసి, ఇప్పుడు ఎన్నికలు అయ్యాక ముష్టి వేసినట్లు కేజీకి కేవలం రూ. 2 తగ్గిస్తే రైతులకు ఏం సరిపోతుందని ప్రశ్నించారు. మార్కెట్‌లో రేట్లు పెంచేటప్పుడు వేగంగా పెంచే వ్యాపారాలు, ధరలు తగ్గినప్పుడు మాత్రం రైతులకు ఆ లబ్ధిని ఎందుకు బదిలీ చేయట్లేదని ఆయన నిలదీశారు.

తమ వైసీపీ హయాంలో ఆక్వా రైతుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ‘అప్సడా’ (APSADA) సంస్థను ఏర్పాటు చేసి సీడ్, ఫీడ్ క్వాలిటీతో పాటు మార్కెటింగ్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించామని జగన్ గుర్తు చేశారు. అయితే చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆక్వా రంగానికి రక్షణగా ఉన్న ‘అప్సడా’ను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రొయ్యలకు కౌంట్ ఆధారంగా కనీస మద్దతు ధర తగ్గకుండా నిరంతరం పర్యవేక్షించామని, రైతుకు నష్టం రాకూడదని చట్టం కూడా తెచ్చామన్నారు. కానీ నేడు మార్కెట్‌లో కేజీ రొయ్యల కౌంట్ రూ. 230లు కూడా దాటని దారుణ పరిస్థితి ఉందన్నారు. అలాగే ఆక్వా రైతులకు తాము యూనిట్ విద్యుత్‌ను రూ. 1.50లకే అందించి, ఐదేళ్లలో సబ్సిడీ కింద రూ. 3,306 కోట్లు భరించామని, గతంలో చంద్రబాబు ఎగ్గొట్టిన రూ. 401 కోట్ల విద్యుత్ బకాయిలను కూడా తామే చెల్లించామని పేర్కొంటూ.. చంద్రబాబు ప్రతి అడుగు మోసపూరితమేనని జగన్ విమర్శించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు