ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ మరియు ఓటు హక్కులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) శుక్రవారం (జూలై 17, 2026) అత్యంత కీలకమైన మరియు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఒక వ్యక్తి యొక్క పౌరసత్వాన్ని నిర్ణయించే లేదా రద్దు చేసే చట్టపరమైన అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) ఏమాత్రం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాపై మాత్రమే ఈసీకి పూర్తి నియంత్రణ, పర్యవేక్షణ అథారిటీ ఉంటుందని పేర్కొన్న ధర్మాసనం.. ఓటరు జాబితా నుంచి ఒకరి పేరు తొలగించినంత మాత్రాన వారి భారత పౌరసత్వం శాశ్వతంగా రద్దు కాదని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా.. ప్రత్యేక ట్రిబ్యునల్స్ తమ అప్పీళ్లను తిరస్కరించిన తర్వాత ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించబడిన వ్యక్తులకు ప్రజా పంపిణీ వ్యవస్థ (Ration/PDS), అన్నపూర్ణ పథకం వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేయకూడదని కోరుతూ ప్రసేన్జిత్ బోస్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, మరియు జస్టిస్ వి. మోహన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి అధికారిక నోటీసులు జారీ చేసింది.
ఈ విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ కోర్టు దృష్టికి కీలక విషయాలు తెస్తూ.. బెంగాల్లో ప్రత్యేక ట్రిబ్యునళ్ల ముందు సుమారు 34 లక్షల అప్పీళ్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని, కానీ కేవలం 38,000 అప్పీళ్లపైనే తీర్పులు వచ్చాయని పేర్కొన్నారు. కేవలం 19 ట్రిబ్యునళ్లు మాత్రమే పనిచేస్తున్నాయని, వారి పౌరసత్వ స్థితిపై తుది నిర్ణయం రాకముందే ఓటర్ల జాబితా తొలగింపును సాకుగా చూపిస్తూ రేషన్, కుల ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ నిలిపివేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాదించారు. దీనిపై జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ స్పందిస్తూ.. గతంలో జరిగిన ‘బీహార్ ఎస్ఐఆర్’ తీర్పును గుర్తుచేశారు. ఓటింగ్ హక్కులపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నంత మాత్రాన అది పౌరసత్వాన్ని ధృవీకరించదని, పౌరసత్వ చట్టం కింద ఈ అంశాన్ని తుది పరిష్కారం కోసం సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖకు రిఫర్ చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉంటుందని స్పష్టం చేస్తూ, ఈ కేసు తదుపరి విచారణను జులై 25 లోపు జాబితా చేసే అవకాశం ఉందని ధర్మాసనం పేర్కొంది.









