అభిమానానికి ఎలాంటి ఎల్లలు లేవని, బలమైన సంకల్పం ఉంటే వేల కిలోమీటర్ల దూరం కూడా ఒక లెక్క కాదని నిరూపిస్తున్నాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక యువకుడు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతి పాలనా దక్షతకు, ఆయన ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితుడైన ఆ అభిమాని.. తన నాయకుడిని ప్రత్యక్షంగా కలుసుకుని అభినందనలు తెలపడమే ఏకైక లక్ష్యంగా ఒక అసాధారణ పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు. చేతిలో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వైపు సాగుతున్న అతని సుదీర్ఘ కాలినడక ప్రయాణం.. తాజాగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశించింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్‌కు చెందిన 24 ఏళ్ల అమన్ అనే యువకుడు.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్‌ను (దళపతి విజయ్) కలిసి పలకరించాలనే బలమైన కోరికతో ఈ సుదీర్ఘ యాత్రను సాగిస్తున్నాడు. చేతిలో జాతీయ జెండాను పట్టుకుని జూలై 3వ తేదీన అలీగఢ్‌లో ప్రయాణాన్ని ప్రారంభించిన అమన్.. దాదాపు రెండు వారాల పాటు నిరంతరాయంగా నడుస్తూ మహారాష్ట్ర మీదుగా ప్రయాణించి, గురువారం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌లో కొద్దిసేపు ఆగిన అమన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలో సాగుతున్న ప్రజాస్వామ్య బద్ధమైన అభివృద్ధి, ప్రజల అవసరాలకు అనుగుణంగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని చెప్పాడు. తన ప్రయాణం హైదరాబాద్ మీదుగా తమిళనాడుకు సాగుతుందని.. మరో 15 రోజుల్లో గమ్యస్థానాన్ని చేరుకోగలనని ధీమా వ్యక్తం చేశాడు.
అమన్‌కు ఇలాంటి సుదీర్ఘ పాదయాత్రలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో (2025లో) కూడా అతను అలీగఢ్ నుండి హైదరాబాద్‌కు కాలినడకన ప్రయాణించి ఏఐఎంఐఎం (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని విజయవంతంగా కలుసుకున్నాడు. ఆ యాత్ర పూర్తి చేసి ఒవైసీని కలవడంతో వచ్చిన ఉత్సాహం, నమ్మకమే తనను ఇప్పుడు విజయ్ థలపతిని కలిసేలా ఈ రెండో భారీ యాత్రకు పురిగొల్పిందని అమన్ తెలిపాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మార్గమధ్యంలో తనకు లభిస్తున్న ప్రజాదరణను అమన్ గుర్తు చేసుకున్నాడు. తాను దాటి వస్తున్న వివిధ నగరాలు, గ్రామాల ప్రజలు చూపించిన ఆదరణ, మానవత్వం వల్ల తన యాత్ర చాలా సులువుగా సాగుతోందని.. దారి పొడవునా ఎంతో మంది సామాన్యులు తనకు ఆహారం, తాగునీరు, రాత్రిపూట బస చేయడానికి వసతి కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారని అమన్ సంతోషం వ్యక్తం చేశాడు.









