హైదరాబాదులోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ విల్లా ఆర్కిడ్స్లో విషాదం చోటుచేసుకుంది. కిడ్నాప్‌కు గురైందని భావించిన ఐదేళ్ల ఆలియా (మోను) చిన్నారి మృతదేహం లభించడంతో తల్లిదండ్రులు, స్థానికులు షాక్‌కు గురయ్యారు.
చిన్నారికి సంబంధించి కిడ్నాప్ కేసుగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సెక్యూరిటీ గార్డు విక్రమ్ ఫోన్ లొకేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగిపోవడంతో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. డ్రోన్ల సాయంతోనూ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.కాగా విల్లాకు ఒకే ఎంట్రెన్స్ ఉండటంతో సీసీటీవీ ఫుటేజీని పలుమార్లు పరిశీలించిన పోలీసులు.. నిందితుడిగా అనుమానిస్తున్న సెక్యూరిటీ గార్డు విక్రమ్ మాత్రమే బయటకు వెళ్లినట్లు గుర్తించినట్లు సమాచారం..
ఇది ఇలా ఉంటే విల్లా కాలనీతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, లాడ్జీల్లో గాలించిన పోలీసులకు.. చివరకు క్లబ్‌హౌస్ సమీపంలోని చిన్నారి సైకిల్ కనిపించడంతో అనుమానం వచ్చింది. క్లబ్‌హౌస్ సెల్లార్‌లోని నీటిలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు..
చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో బట్టలు కుక్కి.. తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.20 లక్షలు డిమాండ్ చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టుబడతాననే భయంతో చిన్నారి గొంతు నులిమి, సెల్లార్‌లోని నీటిలో పడేసి ఉండవచ్చని భావిస్తున్నారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ పరిశీలన అనంతరం పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిగా అనుమానిస్తున్న విక్రమ్ కోసం మల్కాజ్గిరి జోన్ పోలీసులు గాలిస్తున్నారు. అతడు పట్టుబడితేనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.









