ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డిని ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంతో పాటు నియోజకవర్గవ్యాప్తంగా నిలిచిపోయిన అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు.
నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులను ఇర్ఫాన్ బాషా వైఎస్ షర్మిలకు వివరించారు. ప్రొద్దుటూరులో మౌలిక వసతుల కొరత, తాగునీటి ఎద్దడి, అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ, దెబ్బతిన్న రహదారుల సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యల కారణంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.
అదేవిధంగా స్థానిక వ్యాపారులు, చేనేత కార్మికులు, పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా చర్చించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముందుకు సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజా సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన కార్యాచరణపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం.









