టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ‘దళపతి’ విజయ్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ ఆత్మీయ భేటీకి సంబంధించిన ఫొటోలను విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. ముగ్గురూ కలిసి సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న, దేవరకొండ సీఎం విజయ్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
ఈ భేటీ అనంతరం విజయ్ దేవరకొండ తన అనుభవాన్ని పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. “ప్రియమైన దళపతి విజయ్ గారితో అద్భుతమైన సమయం గడిపాను. రోజంతా పనులతో ఎంతో అలసిపోయినప్పటికీ.. మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి జీవితం, పని, ప్రపంచం గురించి అనేక విషయాలను పంచుకున్నారు. ఈ ఒక్క మీటింగ్‌తోనే విజయ్ సార్ నా ఫేవరెట్ అయిపోయారు” అంటూ తన పోస్టులో ప్రశంసలు కురిపించారు.
మరోవైపు రష్మిక మందన్న కూడా ఈ కలయికపై స్పందిస్తూ సీఎం విజయ్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఎప్పటినుంచో విజయ్ సార్‌కు వీరాభిమానినైన తనకు గతంలో ఆయనతో కలిసి ‘వారసుడు’ సినిమాలో నటించే అవకాశం లభించిందని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయనను చూసి ఎంతో గర్వపడుతున్నానని పేర్కొన్నారు. నటుడి స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆయన ప్రయాణం అద్భుతమని, ఆయనకు ఎల్లప్పుడూ తన శుభాకాంక్షలు ఉంటాయని రష్మిక రాసుకొచ్చారు.









