ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న పురపాలక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 106 మున్సిపాలిటీలు, 17 మున్సిపల్ కార్పొరేషన్లలో ఛైర్మన్, మేయర్ పదవుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ సోమవారం అధికారికంగా తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తవడంతో పాటు, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మార్గం సుగమమైంది.
ప్రకటించిన అధికారిక జాబితా ప్రకారం.. 106 మున్సిపాలిటీల్లో వెనుకబడిన తరగతులకు (బీసీ) 35 స్థానాలు, షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) 14 స్థానాలు, షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ) 3 స్థానాలను కేటాయించారు. అన్ని వర్గాల్లో కలిపి మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ ఏకంగా 50 మున్సిపల్ ఛైర్మన్ పీఠాలను మహిళలకే రిజర్వ్ చేశారు. ఎస్టీలకు గూడూరు (మహిళ), ఆత్మకూరు, ఆలూరు కేటాయించగా, ఎస్సీలకు కుప్పం, సామర్లకోట, కొండపల్లి, చీరాల సహా 14 స్థానాలు, బీసీలకు గుడివాడ, నరసరావుపేట, హిందూపురం, నంద్యాల సహా 35 పురపాలికలు దక్కాయి.
ఇక సాధారణ మహిళా కోటా కింద కనిగిరి, భీమవరం, పులివెందుల, రాజంపేట సహా 27 మున్సిపాలిటీలను కేటాయించగా.. తాడిపత్రి, తెనాలి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుకొండ, ప్రొద్దుటూరు సహా 26 మున్సిపాలిటీలు అన్‌రిజర్వ్‌డ్ జాబితాలో నిలిచాయి. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయి తుది జాబితా వెలువడటంతో ప్రధాన రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి వ్యూహాలపై దృష్టి సారించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.









