పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా ఫీల్డింగ్ ప్రమాణాలు ఆందోళనకర రీతిలో పడిపోతుండటంపై భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే న్యూజిలాండ్ పర్యటన నేపథ్యంలో జట్టులో ఫీల్డింగ్ సంస్కృతి మారాలని, ఆటగాళ్లలో జవాబుదారీతనం పెరగాలని సూచించారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో స్పష్టమైన వ్యూహాలు కనిపిస్తున్నప్పటికీ, ఫీల్డింగ్‌పై మాత్రం సరైన దృష్టి సారించడం లేదని.. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ తరంతో పోలిస్తే కొత్తగా జట్టులోకి వస్తున్న యువ ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో చాలా వెనుకబడి ఉన్నారని ఆయన విశ్లేషించారు.
2026 అంతర్జాతీయ టీ20 గణాంకాలను పరిశీలిస్తే భారత ఫీల్డింగ్ వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని టాప్-10 జట్లలో భారత్ క్యాచింగ్ సామర్థ్యం 73.4 శాతంతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది భారత ఆటగాళ్లు ఏకంగా 58 క్యాచ్‌లను నేలపాలు చేశారు. ఫీల్డింగ్ ద్వారా 129 పరుగులు కాపాడినప్పటికీ, క్యాచ్‌ల మిస్సింగ్, గ్రౌండ్ ఫీల్డింగ్ లోపాల వల్ల 226 పరుగులు సమర్పించుకోవడంతో నికరంగా 97 పరుగుల భారీ నష్టం వాటిల్లింది. అంతేకాకుండా 19 రనౌట్ అవకాశాల్లో 14 మాత్రమే సద్వినియోగం చేసుకోగా, ఐదు స్టంపింగ్ ఛాన్సులలో రెండింటిని చేజార్చుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ సమస్య కేవలం అంతర్జాతీయ జట్టుకే పరిమితం కాదని, భారత దేశీయ క్రికెట్ వ్యవస్థ మొత్తం దీనిపై దృష్టి సారించాలని శ్రీధర్ పిలుపునిచ్చారు. బంతిని వేగంగా చేరుకోవడం, త్రోయింగ్ వేగం, రనౌట్లు చేసే నైపుణ్యాలను ఎప్పటికప్పుడు డేటాతో విశ్లేషించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్ ఈదురు గాలులు, క్రైస్ట్‌చర్చ్ చలి తీవ్రత ఫీల్డర్లకు పెను సవాలుగా మారనున్నాయని హెచ్చరించారు. 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని అత్యుత్తమ ఫీల్డర్‌గా తీర్చిదిద్దేందుకు ఇప్పటి నుంచే రోజూ ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆయన మేనేజ్‌మెంట్‌కు సూచించారు.









