“ఇక దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది”: నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే నిప్పులు.. కేంద్రం, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు!

దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలకు కేంద్రబిందువుగా ఉన్న చారిత్రక జంతర్ మంతర్‌కు ఆ గుర్తింపును రద్దు చేస్తూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. కమిటీ సిఫార్సుల మేరకు జంతర్ మంతర్ వద్ద ఇకపై ఆందోళనలకు అనుమతి లేదని, ప్రదర్శనల కోసం రామ్‌లీలా మైదానం, బురారీ మైదానం, సీబీడీ మైదానం అనే మూడు కొత్త ప్రాంతాలను కేటాయిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ నిర్ణయంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఢిల్లీ పోలీసుల ఆదేశాలపై ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించిన అభిజీత్ దిప్కే.. ఒక పిరికి నియంత జంతర్ మంతర్‌ను యుద్ధ క్షేత్రంగా మార్చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. “వారు అధికారిక జాబితా నుంచి జంతర్ మంతర్‌ను తొలగించవచ్చు.. కానీ ఇకపై దేశం మొత్తం జంతర్ మంతర్‌గా మారుతుంది” అని హెచ్చరించారు. ఈ రోజు నిరసన వేదిక హోదాను రద్దు చేసిన ప్రధాని మోదీ, రేపు ప్రజాస్వామ్యాన్నే రద్దు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర పాలకులకు నిరసన తెలిపే స్థలం సమస్య కాదని, ప్రజలు ప్రశ్నించడం, నిరసన తెలపడం అనే ఆలోచనే వారికి పెద్ద సమస్యగా మారిందని ఆయన ఎండగట్టారు.

ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్‌) వివాదంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు, సీజేపీ శ్రేణులు జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు ఉధృతం చేసిన సమయంలోనే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. గత రెండు రోజులుగా జంతర్ మంతర్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకుంటున్నారు. శాంతియుత ప్రజాస్వామ్య పోరాటాలను అణచివేసేందుకే ఆంక్షలు విధిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతుండగా, ఢిల్లీ వేదికగా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు