పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో ఘోర పరాజయం పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఆమె 15,114 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతను మట్టికరిపించిన సువేందు, ఈసారి ఆమె సొంత అడ్డా అయిన భవానీపూర్‌లోనే ఓడించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ ఫలితం బెంగాల్ రాజకీయాల్లో ఒక శకాన్ని ముగించినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో సువేందు చేతిలో ఓడినా, ఉప ఎన్నికల ద్వారా తిరిగి నిలదొక్కుకున్న మమతకు ఈసారి ఓటర్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ముఖ్యంగా సువేందు అధికారి ‘జెయింట్ కిల్లర్’గా అవతరించి, వరుసగా రెండోసారి బెంగాల్ రాజకీయ ధ్రువతారను ఓడించి తన పట్టును నిరూపించుకున్నారు. మమత తన నియోజకవర్గంలో సైతం పట్టు కోల్పోవడం టీఎంసీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
మరోవైపు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. తాజా గణాంకాల ప్రకారం బీజేపీ 200కు పైగా స్థానాల్లో విజయం సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా సాగుతోంది. అక్రమ చొరబాట్లు, శాంతిభద్రతల సమస్యలను అజెండాగా తీసుకున్న బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి ఓటమి చెందడం, బీజేపీ భారీ మెజారిటీతో దూసుకుపోతుండటంతో బెంగాల్‌లో సరికొత్త రాజకీయ శకం ప్రారంభం కానుంది.









