హయత్‌నగర్‌లోని కుమ్మరికుంట చెరువు కట్టపై ఉన్న రోడ్డుపై ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మేరకు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతోతో కలిసి కుమ్మరికుంట చెరువు వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే రోడ్డు పరిస్థితిని పరిశీలించారు.
ఈ మార్గంలో ప్రతిరోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో వాహనదారులకు సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు.
కుమ్మరికుంట చెరువు కట్టపై నూతన రోడ్డు నిర్మాణ పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయడంతో పాటు చెరువు కట్టను వెడల్పు చేయాలని జోనల్ కమిషనర్‌ను ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేలా సంబంధిత అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు.









