కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, అగ్ర నటి త్రిష జంటగా నటించిన తాజా బ్లాక్బస్టర్ చిత్రం ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తున్నప్పటికీ, ఒక వివాదంలో చిక్కుకుంది. టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్ జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో.. భారతీయ సంగీత ప్రపంచంలోనే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్గా పేరొందిన ఇళయరాజాను ఉద్దేశిస్తూ కొన్ని డైలాగులు ఉన్నాయి. ఈ డైలాగులు ఆయన స్థాయిని, గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు, ఇళయరాజా అభిమానులు చిత్ర బృందంపై తీవ్రంగా విమర్శలు గుప్పించడంతో పెద్ద వివాదం రాజుకుంది.
ఈ వివాదం మరింత ముదురుతుండటంతో ‘కరుప్పు’ మూవీ టీమ్ తక్షణమే స్పందిస్తూ ఇళయరాజాకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. చలనచిత్ర రంగానికి ఇళయరాజా చేసిన సేవలు అనన్యసామాన్యమని, ఎందరో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆయన ఎన్నో తరాలుగా స్ఫూర్తిగా నిలిచారని చిత్ర బృందం పేర్కొంది. సినిమాలో ఆయనను ఉద్దేశిస్తూ ఉన్న ఒక డైలాగ్ వల్ల ఇళయరాజా మనస్తాపానికి గురయ్యారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, అయితే ఆయనను అగౌరవపరచడం తమ ఉద్దేశం ఎంతమాత్రం కాదని వారు ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ వివాదానికి త్వరితగతిన ముగింపు పలకడం కోసం, సదరు వివాదాస్పద సీన్లను మరియు డైలాగులను సినిమాలోంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు చిత్ర యూనిట్ సంచలన నిర్ణయం తీసుకుంది. థియేటర్లలో ఈ రోజు నుంచే ఆ మార్పులు అమలులోకి వస్తాయని వెల్లడించారు. చలనచిత్ర పరిశ్రమలో అందరి గౌరవమే తమకు ప్రధానమని, కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలని కోరారు. దీనిని మరింత కాంట్రవర్సీగా మార్చి సోషల్ మీడియాలో ఎలాంటి తప్పుడు వార్తలను, ఊహాగానాలను సృష్టించవద్దని వారు అభిమానులను, నెటిజన్లను వేడుకున్నారు.









