ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో జరిగినట్లుగా భావిస్తున్న మనీలాండరింగ్ ఆరోపణలపై దృష్టి సారించిన ఈడీ అధికారులు… వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్యతో పాటు ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మంగళవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
విచారణ ముగిసిన అనంతరం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు అడిగిన తమ ఆస్తుల వివరాలన్నింటినీ పూర్తిస్థాయిలో అందజేశామని, దర్యాప్తుకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని స్పష్టం చేశారు. తమ కుటుంబం సంపాదించిన ప్రతి రూపాయీ కష్టార్జితమేనని, అందులో ఎలాంటి అక్రమ సంపాదన లేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సిట్ (SIT) కేవలం రాజకీయ కక్షపూరితంగానే తమపై తప్పుడు కేసులు నమోదు చేసిందని ఆయన ఆరోపించారు.
మద్యం స్కామ్‌కు సంబంధించిన ముడుపుల సొమ్ముతో తాము ఆస్తులు కొనుగోలు చేశామనే ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మోహిత్ రెడ్డి తేల్చి చెప్పారు. తాము సంపాదించిన ప్రతి పైసా సక్రమమైన మార్గంలో వచ్చిందేనని, ఈ కేసులను న్యాయపరంగానే ఎదుర్కొంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భార్య, కుమారుడిని ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించిన నేపథ్యంలో ఈ కేసు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.









