హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న 18 ఏళ్ల కె. భరద్వాజ్ రెడ్డి నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైనుంచి దూకి మృతి చెందినట్లు సమాచారం. భవిష్యత్తులో వైద్యుడిగా స్థిరపడాల్సిన యువకుడు అకాల మరణానికి గురికావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
భరద్వాజ్ రెడ్డి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. ఈ ఘటనతో కళాశాలలోనూ విషాద వాతావరణం నెలకొంది. తోటి విద్యార్థులు, అధ్యాపకులు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. యువకుడి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.









