పొరుగు రాష్ట్రం కర్ణాటక కాంగ్రెస్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో సరికొత్త చర్చకు దారితీశాయి. కర్ణాటకలో ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్‌ను కూర్చోబెట్టేందుకు అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేయడంతో, తెలంగాణలోనూ ముఖ్యమంత్రి మార్పు ఉండవచ్చా అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లు దాటిన నేపథ్యంలో, కర్ణాటకలో అమలు చేస్తున్న పవర్ షేరింగ్ (అధికార పంపిణీ) ఫార్ములాను ఇక్కడ ఎందుకు వర్తింపజేయకూడదని రేవంత్‌ను వ్యతిరేకించే కొందరు నేతలు అధిష్ఠానం వద్ద రాయబారాలు నడుపుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
అయితే, కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలకు, తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడిన రోజే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాల మధ్య రెండున్నరేళ్ల పదవీ కాలంపై స్పష్టమైన ఒప్పందం జరిగింది. కానీ తెలంగాణలో అలాంటి అధికార పంపిణీ ఒప్పందాలు ఏవీ జరగలేదు. ఎన్నికల సమయంలో ఒంటిచేత్తో పార్టీని నడిపించి, కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన నాయకుడిగా రేవంత్ రెడ్డికి అధిష్ఠానం వద్ద బలమైన ముద్ర ఉంది. అధికారంలోకి వచ్చిన నాటి నుండి రేవంత్ రెడ్డి సీనియర్ మంత్రులను కలుపుకుపోతూ, వారి గౌరవానికి భంగం కలగకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంతో పార్టీని ఇబ్బంది పెట్టే స్థాయి అసమ్మతి ఇక్కడ ఎక్కడా కనిపించడం లేదు.
మరోవైపు, ముఖ్యమంత్రి మార్పుపై సాగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డిని మార్చే ఆలోచన అధిష్ఠానానికి అస్సలు లేదని, కాకపోతే ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణను మాత్రం త్వరలోనే పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. అసంతృప్త నేతలు కొందరు అధిష్ఠానం వద్దకు వెళ్లి తమ మనసులోని మాటను చెబుతున్నప్పటికీ, తెలంగాణలో ప్రస్తుతానికి ఎలాంటి నాయకత్వ మార్పుల కార్యాచరణ లేదని, ప్రభుత్వం పూర్తి స్థాయి మైలేజీతో ముందుకు సాగుతోందని పార్టీ ఇన్‌సైడ్ టాక్.









