తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాఠశాల ఫీజు చెల్లించలేక, తన పదో తరగతి ఒరిజినల్ సర్టిఫికేట్లు పొందలేక ఇబ్బంది పడుతున్న ఒక పేద విద్యార్థినికి ఆయన అండగా నిలిచారు. బోడుప్పల్‌కు చెందిన భవిత అనే విద్యార్థిని పదో తరగతి పరీక్షల్లో 582 మార్కులతో స్కూల్ టాపర్‌గా నిలిచింది. అయితే, ఇంటర్ చదువుల కోసం సర్టిఫికేట్లు కావాలని స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించగా, పాత ఫీజు బకాయిలు చెల్లిస్తేనే ఇస్తామని వారు నిరాకరించారు. ఈ దీన స్థితిని ఒక స్థానిక యూట్యూబర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, ఆ వీడియో కాస్తా మంత్రి దృష్టికి వెళ్లింది.
ఈ విషయంపై మంత్రి కోమటిరెడ్డి వెంటనే స్పందించి, తన కార్యాలయ అధికారులను ఆరా తీయాల్సిందిగా ఆదేశించారు. విద్యార్థిని తల్లిదండ్రులు వ్యాపారంలో నష్టపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్న మంత్రి, వెంటనే సదరు ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్‌ను సర్టిఫికేట్లతో సహా తన నివాసానికి పిలిపించారు. కేవలం పదో తరగతిలోనే కాకుండా, పాలిసెట్ (POLYCET) ప్రవేశ పరీక్షలో కూడా భవిత రాష్ట్ర స్థాయిలో 634వ ర్యాంకు సాధించిందని తెలిసి మంత్రి ఎంతగానో చలించిపోయారు. సకాలంలో ఫీజు కట్టలేదనే కారణంతో సర్టిఫికేట్లు ఆపేసినందుకు ప్రిన్సిపల్‌ను మందలించిన మంత్రి, అక్కడికక్కడే తన సొంత డబ్బుల నుండి రూ. 60,000 స్కూల్ ఫీజును చెల్లించి భవితకు సర్టిఫికేట్లు అందేలా చూశారు.
ఫీజు మొత్తంతో పాటు, ఆ విద్యార్థిని తక్షణ ఖర్చుల నిమిత్తం మంత్రి మరో రూ. 20,000 ఆర్థిక సాయాన్ని అందించారు. పాలిసెట్ కౌన్సిలింగ్‌కు అదే చివరి రోజు కావడంతో, ఆమె సమయానికి చేరుకునేలా ప్రత్యేక వాహన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భవిత ఉన్నత చదువులకు మున్ముందు కూడా పూర్తి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన మంత్రి, సమాజంలో సాయం చేసే స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. మంత్రి సకాలంలో స్పందించి కెరీర్ పాడవకుండా కాపాడటంతో భవిత కుటుంబ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.









