కర్ణాటకలో ముగిసిన ‘సీఎం’ పంచాయతీ.. డీకే శివకుమార్‌కు పగ్గాలు.. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి కోసం రగడ!

కర్ణాటక రాజకీయాల్లో గత కొంతకాలంగా సాగుతున్న ముఖ్యమంత్రి మార్పు పంచాయతీ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్ అధిష్ఠానానికి నమ్మకస్తుడు, పార్టీ ‘ట్రబుల్‌షూటర్’గా గుర్తింపు పొందిన డీకే శివకుమార్ ఎట్టకేలకు సీఎం కుర్చీని దక్కించుకోబోతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవి నుంచి తప్పుకోవడానికి అంగీకరించడం, డీకే శివకుమార్ ఏకగ్రీవంగా శాసనసభా పక్ష (CLP) నేతగా ఎన్నిక కావడంతో ఆయన అభిమానుల్లో తీవ్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సీఎం కుర్చీ సమస్య సర్దుమణిగిందని కాంగ్రెస్ హైకమాండ్ ఊపిరి పీల్చుకునే లోపే.. కన్నడ నాట ఇప్పుడు సరికొత్తగా ఉప ముఖ్యమంత్రి (డిప్యూటీ సీఎం) పదవుల కోసం భారీ స్థాయిలో గొడవలు, డిమాండ్లు మొదలయ్యాయి.

గతంలో సిద్ధరామయ్య సీఎంగా ఉన్నప్పుడు ముగ్గురు డిప్యూటీ సీఎంలను పెట్టాలని ప్రయత్నించినా, అప్పట్లో ఒంటరి డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ ఒత్తిడితో ఆ ప్రతిపాదన వీగిపోయింది. కానీ ఇప్పుడు డీకే శివకుమార్ సీఎం అవుతుండటంతో.. సామాజిక సమీకరణాల ఆధారంగా కనీసం ఇద్దరు లేదా ముగ్గురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని అధిష్ఠానం యోచిస్తోంది. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండటంతో ప్రభుత్వ విధులను, పార్టీ (KPCC) అధ్యక్ష బాధ్యతలను వేరు చేయాలని హైకమాండ్ భావిస్తోంది. ఈ క్రమంలోనే పలు సామాజిక వర్గాల నుంచి ఆశావహుల జాబితా చాంతాడంత తయారైంది. దళిత కోటాలో పరమేశ్వర్, ప్రియాంక్ ఖర్గే, మహదేవప్పలతో పాటు సీనియర్ నేత కేహెచ్. మునియప్ప రేసులో ఉండగా, లింగాయత్ వర్గం నుండి ఎంబీ పాటిల్, ఈశ్వర్ ఖండ్రే, మైనార్టీ కోటాలో జమీర్ అహ్మద్ వంటి సీనియర్లు ఈ పదవుల కోసం గట్టిగా పట్టుబడుతున్నారు.

ఈ పదవుల పంపకాల రగడ అప్పుడే వీధుల్లోకి చేరింది. సీనియర్ నేత మునియప్పకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ ఆయన మద్దతుదారులు శనివారం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నిరసనలకు దిగారు. దళితుల్లోని మడిగ వర్గానికి కీలక పదవులు ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు రాజకీయ నష్టం తప్పదని హెచ్చరించారు. మరోవైపు, లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వర్ ఖండ్రేకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో లింగాయత్‌లు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతారని గురు బసవ పట్టదేవరు హెచ్చరికలు జారీ చేశారు. ఈ రేసులో ఉన్న సీనియర్లలో ఎవరికి పదవులు దక్కినా, దక్కకపోయినా రాష్ట్ర కాంగ్రెస్‌లో సరికొత్త అలజడి రేగడం ఖాయంగా కనిపిస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు