లాటరైట్ గనుల లీజులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ: ‘సేవింగ్ క్లాజ్’ ఇవ్వాలని విజ్ఞప్తి

లాటరైట్ ఖనిజం వర్గీకరణలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో తలెత్తిన తీవ్ర ఇబ్బందులను వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి మంగళవారం ఒక లేఖ రాశారు. కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనల వల్ల రాష్ట్రంలో గనుల లీజుల ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయిందని, దీనివల్ల పెండింగ్‌లో పడిపోయిన దరఖాస్తుల విషయంలో ఏపీకి ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు.

లాటరైట్‌లో అల్యూమినియం శాతం 20 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, దాన్ని ఇకపై మైనర్ మినరల్‌గా కాకుండా బాక్సైట్‌గా (మేజర్ మినరల్) పరిగణించాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల గతంలో మైనర్ మినరల్ కింద ప్రాసెస్ అవుతున్న దాదాపు 402 గనుల లీజు దరఖాస్తులను ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని సీఎం లేఖలో పేర్కొన్నారు. వీటిలో 19 లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI), 113 ప్రభుత్వ భూములు, 255 అటవీ భూములు, మరియు 15 పట్టా భూములకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

పాత నిబంధనల ప్రకారమే వందలాది మంది దరఖాస్తుదారులు అప్లికేషన్ ఫీజులు, భూముల కొనుగోళ్లు, అటవీ అనుమతుల కోసం ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. గతంలో మైకా, క్వార్ట్జ్, బారైట్స్ వంటి ఖనిజాలను మైనర్ నుంచి మేజర్ కేటగిరీకి మార్చినప్పుడు కేంద్రం ‘సేవింగ్ క్లాజ్’ ఇచ్చిందని, అదే తరహాలో లాటరైట్ ఖనిజానికి కూడా సేవింగ్ క్లాజ్ వర్తింపజేసి, పెండింగ్‌లో ఉన్న 402 దరఖాస్తులను పాత నిబంధనల ప్రకారమే ప్రాసెస్ చేయడానికి రెండేళ్ల పాటు వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సడలింపు ఇస్తే దరఖాస్తుదారులకు ఆర్థిక నష్టం జరగకుండా, సిమెంట్, ఐరన్ ఓర్, రోడ్డు నిర్మాణ పరిశ్రమలకు ముడిసరుకు కొరత లేకుండా ఉపాధి అవకాశాలు నిలబడతాయని లేఖలో స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు