కర్ణాటక రాజకీయాల్లో ‘ట్రబుల్ షూటర్’గా పేరొందిన డీకే శివకుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బుధవారం (జూన్ 3) ప్రమాణస్వీకారం చేయబోతున్న వేళ, ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య సోషల్ మీడియాలో పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూ, అధిష్ఠానం నమ్మకాన్ని నిలబెట్టిన తన తండ్రి పడిన కష్టాలు, చేసిన త్యాగాల వల్లే నేడు ఆయనకు ఈ అత్యున్నత పదవి దక్కుతోందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ప్రజాసేవకే అంకితమైన తన తండ్రి నిబద్ధతను వివరిస్తూ గతంలో జరిగిన ఒక హృదయ విదారక సంఘటనను ఈ సందర్భంగా ఐశ్వర్య గుర్తుచేసుకున్నారు.
మనీల్యాండరింగ్ ఆరోపణల కేసులో భాగంగా సెప్టెంబర్ 2019లో డీకే శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపిన రోజులను ఐశ్వర్య ప్రస్తావించారు. జైలు నుండి విడుదలైన తర్వాత తన తండ్రి నేరుగా ఇంటికి రాకుండా, తన కోసం ఢిల్లీ వీధుల్లో నిద్రాహారాలు మానేసి, చెప్పులు కూడా లేకుండా ఎదురుచూస్తున్న వేలాది మంది అభిమానులను, పార్టీ కార్యకర్తలను పలకరించేందుకు వెళ్లారని తెలిపారు. ఆ సమయంలో ఎందుకు అలా చేశారని తాను ప్రశ్నిస్తే.. ‘నా కోసం అంతగా తపించిన వారిని కాదని నేను ఎలా ఇంటికి రాగలను’ అని తండ్రి చెప్పిన సమాధానంతో ఆయనకు ప్రజల పట్ల ఉన్న అపారమైన ప్రేమ తనకు అర్థమైందని ఐశ్వర్య భావోద్వేగానికి లోనయ్యారు.
పార్టీ కోసం, ప్రజల కోసం డీకే శివకుమార్ ఎన్నో ఏళ్లుగా విరామం లేకుండా శ్రమిస్తున్నారని, కనీసం తమ కుటుంబంతో సరదాగా గడపడానికి కూడా సమయం కేటాయించలేకపోయారని ఐశ్వర్య తన పోస్ట్‌లో పేర్కొన్నారు. గతంలో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఉన్నప్పుడు బీజేపీ నాయకులు ఢిల్లీ నుండి ఫోన్ చేసి, డిప్యూటీ సీఎం పదవి కావాలా లేక జైలుకు వెళ్తావా అని ఆఫర్ ఇస్తే.. సిద్ధాంతాలను వదులుకోలేక జైలుకు వెళ్ళడానికే తన తండ్రి సిద్ధపడ్డారని ఆమె గుర్తుచేశారు. దశాబ్దాల నిరీక్షణ తర్వాత తన తండ్రి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తుండటంపై ఆమె తన తండ్రికి సాదరంగా శుభాకాంక్షలు తెలియజేశారు.









