భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియా కోచింగ్ సిబ్బందికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టు కొత్త స్పిన్ బౌలింగ్ కోచ్‌గా మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేను నియమించింది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ నుంచి ఆయన తన బాధ్యతలను స్వీకరించనున్నారు. భారత పిచ్‌లపై మరియు రాబోయే అంతర్జాతీయ టోర్నీలలో జట్టు స్పిన్ విభాగ వనరులను మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యంగా ఈ ఎంపిక జరిగింది.
53 ఏళ్ల సాయిరాజ్ బహుతులేకు అటు ఆటగాడిగా, ఇటు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. ఆయన 2001-2003 మధ్య కాలంలో భారత్ తరఫున రెండు టెస్టులు, ఎనిమిది వన్డే మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా, సుదీర్ఘమైన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఏకంగా 630 వికెట్లు పడగొట్టడంతో పాటు 6,176 పరుగులు సాధించి మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన విదర్భ, కేరళ, గుజరాత్, బెంగాల్ వంటి దేశవాళీ జట్లకు ప్రధాన కోచ్‌గా పనిచేశారు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు స్పిన్ కోచ్‌గా సేవలు అందించడమే కాకుండా.. 2022లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత యువ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించడం విశేషం.
ఈ కొత్త నియామకంతో టీమిండియా ప్రస్తుత కోచింగ్ బృందంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్‌లతో కలిసి బహుతులే పని చేయనున్నారు. 2021 నుండి 2024 వరకు బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో కీలక సభ్యుడిగా ఉన్న బహుతులే ఈ నియామకంపై స్పందిస్తూ.. “టీమిండియాకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఎంపిక కావడం నాకు దక్కిన గొప్ప గౌరవం. గతంలో ఆటగాడిగా దేశానికి సేవ చేశాను, ఇప్పుడు కోచింగ్ రూపంలో మరోసారి భారత క్రికెట్ పురోగతికి నా వంతు తోడ్పాటు అందించే అవకాశం రావడం ఎంతో ప్రత్యేకంగా ఉంది” అని సంతోషం వ్యక్తం చేశారు.









