విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం దేశ, విదేశీ ప్రయాణికులను ఆకర్షించేలా సరికొత్త గ్లోబల్ ఏరోసిటీగా రూపాంతరం చెందుతోంది. కేవలం విమానయాన సేవలకు మాత్రమే పరిమితం కాకుండా.. ఫైవ్ స్టార్ హాస్పిటాలిటీ (ఆతిథ్య రంగం), వ్యాపారం, ఆధునిక జీవనశైలిని ఏకం చేసే ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్ సిటీ ఎకో సిస్టంగా ఈ ప్రాంతం రూపుదిద్దుకుంటోంది. వ్యాపార ప్రయాణికులు, పర్యాటకులు మరియు అంతర్జాతీయ సందర్శకులకు ప్రపంచస్థాయి ప్రీమియం సౌకర్యాలు కల్పించడం ద్వారా అంతర్జాతీయ పర్యాటక, కార్పొరేట్ సమావేశాల గమ్యస్థానంగా విశాఖపట్నం స్థానాన్ని ఈ విమానాశ్రయం మరింత బలోపేతం చేయనుంది.
పెట్టుబడుల సదస్సులు, కార్పొరేట్ ప్రయాణాలను ఆకర్షించడంలో ఇక్కడి ఆతిథ్య మౌలిక సదుపాయాలు వ్యూహాత్మక పాత్ర పోషించనున్నాయి. విశాఖ – భోగాపురం కారిడార్‌లో లగ్జరీ పర్యాటక రంగానికి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు ఇక్కడ పుంజుకున్నాయి. ఇందులో భాగంగానే ఒబెరాయ్, ఐటీసీ, తాజ్, హిల్టన్ వంటి దిగ్గజ హోటల్ సంస్థలు ఈ ప్రాంతంలో తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను స్థాపించేందుకు ముందుకు వచ్చాయి. ఈ భారీ ప్రాజెక్టుల రాకతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగానికి మునుపెన్నడూ లేని విధంగా భారీ డిమాండ్ ఏర్పడింది.
మరోవైపు ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు విశాఖపట్నం నగరం నుండి భోగాపురం విమానాశ్రయానికి ఒక ప్రత్యేక కనెక్టివిటీ కారిడార్ నిర్మాణాన్ని కూడా తలపెట్టారు. ఈ నూతన అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, ప్రస్తుతం ఉన్న విశాఖ విమానాశ్రయాన్ని పూర్తిగా కార్గో సేవలకు మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల స్థావరాలకు కేటాయించే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలు మరియు ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చెందుతున్న భోగాపురం విమానాశ్రయం మున్ముందు దిగ్గజ వ్యాపారవేత్తలకు ప్రధాన వేదికగా మారి, అంతర్జాతీయ విమానయాన పటంలో విజయనగరానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకురానుంది.









