ఇటీవలి కాలంలో చిత్ర పరిశ్రమలో ‘సినిమా రివ్యూలు’, నెగెటివ్ టాక్ వల్ల థియేటర్లకు జనాలు రావడం లేదనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ హాట్ టాపిక్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తనదైన శైలిలో స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రివ్యూలు రాయడం అనేది ఒక రకమైన ప్రజాసేవ లేదా దాతృత్వంతో సమానమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రేక్షకులకు రక్షణ కవచంలా రివ్యూవర్లు
రివ్యూవర్లు సినిమా పరిశ్రమ కోసం పని చేసేవాళ్లు కాదని, వారు పూర్తిగా ప్రేక్షకులకు చెందినవారని ఆర్జీవీ స్పష్టం చేశారు. ఒక సినిమా చెత్తగా ఉన్నప్పుడు.. ప్రేక్షకులు తమ కష్టార్జితాన్ని, అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకోవద్దని ఒక విమర్శకుడు హెచ్చరిస్తే, అది సమాజానికి చేసే మంచి పనే అవుతుందని వర్మ పేర్కొన్నారు. ఈ రోజుల్లో సినిమా టికెట్ల ధరలు, థియేటర్లలో స్నాక్స్ రేట్లు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో, రివ్యూవర్లు సామాన్య ప్రేక్షకుడి జేబుకు ఒక రక్షణ కవచంలా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు.
కంటెంట్‌పై దృష్టి పెట్టాలి: ఆర్జీవీ హితవు
సినిమా నచ్చకపోతే రివ్యూల వల్ల ఫ్లాప్ అయిందని నిర్మాతలు ఏడవడం మానేసి, తమ కంటెంట్‌ను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చూసుకోవాలని వర్మ హితవు పలికారు. ఇంటర్నెట్‌లో మాట్లాడే జనాల నోళ్లు ఎవరూ నొక్కలేరని, ఒకసారి టికెట్ అమ్మిన తర్వాత ఆ సినిమా ఫలితాన్ని డిసైడ్ చేసే హక్కు పూర్తిగా ఆడియన్స్‌కే ఉంటుందనే నిజాన్ని మేకర్స్ గ్రహించాలని స్పష్టం చేశారు. కంటెంట్ బాగుంటే రివ్యూలతో సంబంధం లేకుండా సినిమాలు ఆడుతాయని చెప్పడానికి ‘యానిమల్’ లాంటి చిత్రాలే ఉదాహరణ అని ఆయన గుర్తుచేశారు.









