టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున ఆయన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హస్పిటల్‌కు సంబంధించిన 25 సంవత్సరాల (సిల్వర్ జూబ్లీ) మైలురాయి వేడుకల్లో పాల్గొన్నారు. క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న చిన్నారుల సమక్షంలో బాలయ్య తన పుట్టినరోజు కేక్ కట్ చేసి, ఆ చిన్నారి రోగులకు స్వయంగా కేక్ తినిపించి, ప్రత్యేక బహుమతులు అందజేస్తూ వారిలో ధైర్యాన్ని నింపారు.
40 పడకల నుంచి 715 పడకల స్థాయికి: బాలకృష్ణ
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతు ఆసుపత్రి ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. 1989లో అప్పటి ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ ఈ ఆసుపత్రికి శంకుస్థాపన చేయగా, 2000వ సంవత్సరంలో ఇది అందుబాటులోకి వచ్చిందని వివరించారు. ప్రారంభంలో కేవలం 40 పడకలతో చిన్న ఆసుపత్రిగా మొదలైన బసవతారకం, నేడు అత్యాధునిక వైద్య సేవలతో 715 పడకల భారీ ఆసుపత్రిగా రూపాంతరం చెందిందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే మొదటి ఐదు బెస్ట్ క్యాన్సర్ స్పెషాలిటీ ఆసుపత్రుల జాబితాలో ఇది స్థానం సంపాదించుకోవడం వెనుక ఎంతోమంది అంకితభావం, శ్రమ దాగి ఉన్నాయని వారికి కృతజ్ఞతలు తెలిపారు.
వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే!
సినీ, రాజకీయ రంగాల్లో దశాబ్దాలుగా అదే ఉత్సాహంతో దూసుకుపోతున్న బాలకృష్ణ తన ఫిట్‌నెస్ మరియు ఎనర్జీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమేనని, ఎప్పటికీ ప్రజాసేవలో, సినిమాల్లో ప్రేక్షకులను అలరించడంలో తన జోష్ ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మరియు పలువురు నందమూరి అభిమానులు పాల్గొని బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.









