టిఆర్ఎస్ (బిఆర్ఎస్) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మావోయిస్టుల ఉనికిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో అడవుల్లో మావోయిస్టులు (అన్నలు) ఉన్న సమయంలో ప్రభుత్వ అధికారులు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించేవారని, ప్రస్తుతం వారి ఉనికి లేకపోవడంతో అధికారుల ప్రవర్తనలో స్పష్టమైన మార్పు వచ్చిందని ఆమె పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఆమె ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బాయి బాట’ కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు మంచిర్యాల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తన వారం రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజైన సోమవారం మంచిర్యాల జిల్లాలోని ఆర్కే-7 గని వద్దకు చేరుకున్న కవితను పోలీసులు, సింగరేణి భద్రతా సిబ్బంది గేటు వద్దే నిలువరించారు. గేట్ మీటింగ్ నిర్వహించకుండా అధికారులు అడ్డుకోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అక్కడి సిబ్బందితో కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసుల ఆంక్షలను విజయవంతంగా ఛేదించుకుని ముందుకు సాగిన ఆమె, అక్కడ వేచి ఉన్న సింగరేణి కార్మికులతో నేరుగా సమావేశమై వారి సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో కార్మికుల సమస్యల పేరుతో రాహుల్ గాంధీ, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి ప్రాంతానికి వచ్చినప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడు తమకు ఎందుకు విధిస్తున్నారని ఆమె నిలదీశారు. కేవలం పోలీసులను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆరోపించారు. కార్మికుల హక్కులను కాలరాస్తే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని, కార్మికుల సంక్షేమం, ఓపెన్‌కాస్ట్ గనుల విస్తరణ, ఉపాధి సమస్యలపై వారి పక్షాన పోరాటం కొనసాగిస్తామని కవిత హెచ్చరించారు.









