పాకిస్థాన్‌లో సెలవులు గడపడానికి వచ్చిన ఒక ఆస్ట్రేలియా దేశపు పాకిస్థానీ సంతతి కుటుంబంపై స్థానిక పోలీసులు పొరపాటున బుల్లెట్ల వర్షం కురిపించారు. లాహోర్‌కు సుమారు 300 కిలోమీటర్ల దూరంలోని చక్వాల్ జిల్లాలో జూన్ 10వ తేదీ రాత్రి ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిదేళ్ల చిన్నారి హనియా అహ్మద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె తండ్రి అదీల్ అహ్మద్, సోదరుడు ఆఫాన్ తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో ప్రాణాపామ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఈ విషాదకరమైన ఘటన యొక్క వివరాల్లోకి వెళ్తే.. సదరు కుటుంబం ఇటీవలే సౌదీ అరేబియాలో హజ్ యాత్ర ముగించుకుని, వేసవి సెలవుల కోసం పాకిస్థాన్ చేరుకుంది. రాత్రి వేళ వీరు తమ బంధువుల ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఇద్దరు సాయుధ దొంగలు వీరి కారును అడ్డుకుని గన్‌పాయింట్‌తో బెదిరించారు. దీంతో భయపడిన బాధితులు వెంటనే పోలీసు అత్యవసర నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న క్రైమ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ (సీసీడీ) సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అయితే, పోలీసులను చూడగానే బైక్‌పై ఉన్న దొంగలు అక్కడి నుంచి పరారు కాగా, భయాందోళనకు గురైన ఆ కుటుంబం కూడా తమ కారును వేగంగా ముందుకు పోనిచ్చింది. ఈ క్రమంలో ఆ వాహనం దొంగలదేనని భ్రమించిన పోలీసులు ఏమాత్రం ఆలోచించకుండా కారుపై విచక్షణా రహితంగా పది రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు. ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతుండగా, దీనిపై పారదర్శకమైన విచారణ జరపాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కాల్పులు జరిపిన ప్రధాన పోలీసు అధికారిని అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేయగా, దోపిడీకి పాల్పడిన నిందితులను పోలీసులు మరో ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపినట్లు ప్రకటించారు.









