జియో బంపర్ ఆఫర్..! 55కే 1,000కిపైగా టీవీ ఛానళ్లు..

వినోద ప్రియుల కోసం రిలయన్స్‌ జియో కొత్త రీచార్జ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కేవలం రూ.55తో 30 రోజుల పాటు జియోటీవీ యాప్‌లో 1,000కిపైగా లైవ్‌ టీవీ ఛానళ్లను వీక్షించే అవకాశం కల్పించింది. ఈ ప్లాన్‌ ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులిద్దరికీ అందుబాటులో ఉంటుంది.

 

ఈ ప్లాన్‌లో 16కుపైగా భాషల్లో ప్రసారమయ్యే 1,000కి పైగా లైవ్‌ టీవీ ఛానళ్లను చూడొచ్చు. అలాగే 150కుపైగా ప్రీమియం ఛానళ్లు కూడా అందుబాటులో ఉంటాయని జియో తెలిపింది. స్టార్‌ప్లస్‌ హెచ్‌డీ, కలర్స్‌ హెచ్‌డీ, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెలివిజన్‌ హెచ్‌డీ, డిస్కవరీ, యానిమల్‌ ప్లానెట్‌ వంటి ఛానళ్లు ఇందులో భాగంగా ఉంటాయి.

 

జియోస్టార్‌, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సన్‌ టీవీ నెట్‌వర్క్‌, వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ, ఈటీవీ నెట్‌వర్క్‌కు చెందిన పలు ఛానళ్లు కూడా ఈ ప్లాన్‌లో లభిస్తాయి. అయితే జియోస్టార్‌, సోనీకి చెందిన లైవ్‌ స్పోర్ట్స్‌ ఛానళ్లను మాత్రం ఈ ప్లాన్‌తో వీక్షించే అవకాశం ఉండదు.

 

ఈ ప్లాన్‌కు ప్రత్యేకంగా యాక్టివేషన్‌ అవసరం లేదని జియో తెలిపింది. రూ.55తో రీచార్జ్‌ చేసిన తర్వాత జియోటీవీ యాప్‌లో జియో మొబైల్‌ నంబర్‌తో లాగిన్‌ అయితే వెంటనే ప్రీమియం ఛానళ్లు అందుబాటులోకి వస్తాయి.

 

అయితే ఈ ప్లాన్‌లో వాయిస్‌ కాల్స్‌, మొబైల్‌ డేటా, ఎస్‌ఎంఎస్‌ వంటి ప్రయోజనాలు ఉండవు. ఇది పూర్తిగా వినోదం కోసం రూపొందించిన ప్లాన్‌. ఒక మొబైల్‌ డివైజ్‌లో మాత్రమే ఈ సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువసార్లు రీచార్జ్‌ చేస్తే ప్రస్తుత 30 రోజుల గడువు ముగిసిన తర్వాత తర్వాతి ప్లాన్‌ ఆటోమేటిగ్గా అమల్లోకి వస్తుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు