న్యూజిలాండ్‌లో గురువారం (జూలై 16, 2026) భారీ భూకంపం సంభవించింది. దేశంలోని దక్షిణ దీవి (South Island) పరిధిలో రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూమి ఉగ్రరూపం దాల్చడంతో అక్కడి ప్రభుత్వం తక్షణమే స్పందించి సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం ధాటికి ఒక్కసారిగా ఇళ్లు, కార్యాలయాలు కంపించడంతో పశ్చిమ తీర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు.
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫియోర్డ్‌ల్యాండ్ రీజియన్‌లోని ‘టె అనౌ’ పట్టణానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు అధికారులు గుర్తించారు. భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో.. మిల్ఫోర్డ్ సౌండ్ నుంచి ప్యూసెగుర్ పాయింట్ వరకు ఉన్న దక్షిణ దీవి పశ్చిమ తీర ప్రాంతాలకు సునామీ పొంచి ఉందంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్రపు అలలు పోటెత్తి తీరప్రాంతాల్లోకి చొచ్చుకువచ్చే ప్రమాదం ఉందని జాతీయ అత్యవసర నిర్వహణ ఏజెన్సీ (NEMA) వెల్లడించింది. ప్రజలు ఆలస్యం చేయకుండా ఎత్తైన ప్రదేశాలకు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, రహదారులపై ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా ఉండేందుకు వీలైనంత వరకు నడిచి, పరిగెత్తుతూ లేదా సైకిళ్లపై వెళ్లాలని స్పష్టం చేసింది.
ఆస్ట్రేలియన్, పసిఫిక్ టెక్టానిక్ ప్లేట్ల సరిహద్దులో న్యూజిలాండ్ ఉండటం వల్ల ఈ ప్రాంతంలో తరచుగా భూ ప్రకంపనలు సంభవిస్తుంటాయని పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రభావాన్ని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు. గతంలో 2011లో క్రైస్ట్‌చర్చ్ నగరంలో సంభవించిన ఘోర భూకంపం కారణంగా 185 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే, తాజా భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని, విపత్తు నిర్వహణ బృందాలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.









