ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) యూనియన్లో చోటుచేసుకుంటున్న అంతర్గత పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనియన్లో జరిగిన అవినీతిపై తాము చర్యలు చేపడుతుంటే, దోషులను కాపాడేందుకు కొందరు తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ ఆయన సినీ నిర్మాతలను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. జూలై 17వ తేదీతో ఉన్న ఈ లేఖను జానీ మాస్టర్ తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేయడంతో సినీ పరిశ్రమలో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సినీ కార్మికుడిగా తన ఎదుగుదలకు నిర్మాతలే మూలకారణమని, తాము ప్రతి నిర్మాతను దైవసమానులుగా భావిస్తామని జానీ మాస్టర్ లేఖలో పేర్కొన్నారు. ఒక నిర్మాత సినిమా నిర్మిస్తే దానిపై ఎన్నో కుటుంబాలు ఆధారపడి జీవిస్తాయని, అలాంటిది డ్యాన్సర్లకు నిర్మాతల నుంచి అందే నగదును కొంతమంది ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్లు అక్రమంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు చేపడుతుంటే ఫెడరేషన్ పెద్దలు అడ్డుపడుతున్నారని, తప్పు చేసిన వారికి సహకరిస్తూ దోషులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ న్యాయం వైపే నిలబడతానని లేఖలో స్పష్టం చేశారు.
గత కొంతకాలంగా డ్యాన్సర్స్ యూనియన్లో నిధుల వినియోగానికి సంబంధించి జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. అయితే, మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో సమస్య సద్దుమణిగిందని, తామంతా కలిసే ఉన్నామని జానీ మాస్టర్ ఇటీవల వివరణ ఇచ్చినప్పటికీ, ఫెడరేషన్ అతడిపై దేశవ్యాప్త బహిష్కరణ విధించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయన పరిశ్రమను ఉద్దేశించి రాసిన తాజా బహిరంగ లేఖ టాలీవుడ్ యూనియన్లోని అంతర్గత వివాదాలను మరోసారి బహిర్గతం చేసింది.









