షార్‌లో చారిత్రక ఘట్టం: కుమారుడితో కలిసి విక్రమ్-1 ప్రయోగాన్ని వీక్షించిన మంత్రి నారా లోకేశ్‌

భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర లిఖిస్తూ, దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. పూర్తి స్వదేశీ  పరిజ్ఞానంతో, హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ ప్రయోగం అంతరిక్ష వాణిజ్యంలో దేశానికి కొత్త ద్వారాలు తెరిచింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) వేదికగా జరిగిన ఈ చరిత్రాత్మక ప్రయోగాన్ని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తన కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ప్రత్యక్షంగా వీక్షించారు. ‘మిషన్ ఆగమన్’ పేరుతో శనివారం మధ్యాహ్నం 12:05 గంటలకు షార్‌లోని ఒకటవ ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లగా, లాంచ్ వ్యూ గ్యాలరీ నుండి దీనిని తిలకించిన మంత్రి లోకేశ్, దేవాన్ష్ ఈ అద్భుత విజయానికి ఎంతగానో హర్షం వ్యక్తం చేశారు.

భారత ప్రైవేట్ అంతరిక్ష రంగ ప్రస్థానంలో ‘విక్రమ్-1’ ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ రాకెట్ సుమారు 350 కిలోల బరువున్న పేలోడ్‌ను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని నిమ్న కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం కలిగి ఉంది. స్కైరూట్ సంస్థ సొంతంగా అభివృద్ధి చేసిన ప్రొపల్షన్ సిస్టమ్స్, 3డీ ప్రింటెడ్ ఇంజన్లు, ఘన ఇంధన రాకెట్ బూస్టర్లను ఇందులో ఉపయోగించారు. అంతరిక్ష ప్రయోగాల వ్యయాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు ఉపగ్రహాలను వేగంగా, సమర్థవంతంగా కక్ష్యలోకి చేర్చడమే లక్ష్యంగా విక్రమ్-1ను రూపొందించినట్లు స్కైరూట్ తెలిపింది. ఈ తొలి ప్రయోగంలో విక్రమ్-1 రాకెట్ నాలుగు చిన్న ఉపగ్రహాలను రోదసిలోకి తీసుకెళ్లింది. వీటిలో గ్రహాస్పేస్, కాస్మోసర్వ్, డీక్యూబ్డ్ సంస్థల పేలోడ్లతో పాటు స్కైరూట్ సొంత ఉపగ్రహం ‘స్కోప్’ (SCOPE) ఉన్నాయి. అంతేకాకుండా కాస్మోస్ డైమండ్స్‌కు చెందిన ‘కాస్మిక్ బ్లూమ్’ అనే ఒక కళాకృతిని, మరో మైక్రో-ఆర్ట్ పీస్‌ను కూడా ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపడం విశేషం.

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి. నారాయణన్, స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈవో పవన్ కుమార్ చందన తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రయోగం దేశంలో డీప్ టెక్ ఆశయాలకు, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు గొప్ప ఊతాన్ని ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ‘మిషన్ ఆగమన్’ విజయం.. ప్రభుత్వ రంగ సంస్థ ఇస్రోకు తోడుగా ప్రైవేట్ కంపెనీలు కూడా అంతరిక్ష పరిశోధనల్లో కీలక పాత్ర పోషించే సరికొత్త నూతన శకానికి నాంది పలికింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు