హిందూ వివాహం కాంట్రాక్ట్ కాదు, భార్యపై ఆసక్తి పోయిందంటే కుదరదు: కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

హిందూ వివాహం అనేది ఒక ఒప్పందం (కాంట్రాక్ట్) కాదని, అది జీవితకాలం నిలిచే ఒక పవిత్రమైన బంధం అని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. భార్యపై ఆసక్తి తగ్గిందనే ఏకపక్ష కారణంతో భర్త విడాకులు కోరడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక బంధం తర్వాత కేవలం వ్యక్తిగత ఇష్టాయిష్టాల ఆధారంగా బంధం నుండి వైదొలగడం కుదరదని స్పష్టం చేస్తూ, భర్త దాఖలు చేసిన విడాకుల అప్పీల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

వివరాల్లోకి వెళితే.. ఒక జంట 2003లో ప్రేమించి, కులాంతర వివాహం చేసుకున్నారు. వారికి ప్రస్తుతం యుక్తవయస్సుకు చేరిన ఒక కుమార్తె కూడా ఉంది. అయితే, కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో, భార్యతో కలిసి జీవించేందుకు తనకు ఎలాంటి ఆసక్తి లేదని పేర్కొంటూ భర్త విడాకుల కోసం మైసూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. మరోవైపు, తన వైవాహిక హక్కుల పునరుద్ధరణను కోరుతూ భార్య కూడా పిటిషన్ దాఖలు చేసింది. 2019లో ఫ్యామిలీ కోర్టు భార్యకు అనుకూలంగా తీర్పునిస్తూ భర్త విడాకుల పిటిషన్‌ను కొట్టివేసింది. అయినప్పటికీ భర్త భార్యతో కలిసి జీవించేందుకు నిరాకరిస్తూ, ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేశాడు.

ఈ పిటిషన్‌ను జస్టిస్ డి.కె. సింగ్, జస్టిస్ టి.ఎం. నదాఫ్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం విచారించింది. “హిందూ వివాహ వ్యవస్థలో పెళ్లి అనేది జీవితాంతం కొనసాగే ఒక పవిత్రమైన క్రతువు. కేవలం భాగస్వామిపై ఆసక్తి లేదనే కారణంతో ఆ బంధాన్ని తెంచుకోలేరు. ఇలా చేయడం తాను చేసిన తప్పు నుండి తానే ప్రయోజనం పొందాలని చూడటమే అవుతుంది” అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి తగిన కారణాలు లేవని పేర్కొంటూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం పూర్తిగా తిరస్కరించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు