దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై మోదీ ప్రభుత్వం దాడికి తెగబడటం అత్యంత అప్రజాస్వామికమని సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అత్తు ఇమామ్, పూజల గోపికృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. టీపీసీసీ పిలుపు మేరకు బుధవారం సిద్దిపేట పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థులు కలిసి విక్టరీ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు దారుణంగా లాఠీచార్జ్ చేశారని నిరసనకారులు ధ్వజమెత్తారు. బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్లిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలపై దౌర్జన్యానికి దిగి అరెస్టు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే విఘాతమన్నారు. అధికార బలంతో విపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి గద్దె దిగే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ నీట్ పరీక్ష పత్రాలను అమ్ముకుంటున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోరు విప్పకపోవడం సిగ్గుచేటని అత్తు ఇమామ్ విమర్శించారు. పేపర్ లీకేజీలపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో స్వయంగా పార్లమెంట్ ప్రతిపక్ష నేతకే రక్షణ లేని పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేస్తూ, రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.









