అమెరికా-ఇరాన్ చర్చల మధ్యవర్తిత్వం: అగ్రరాజ్యం నుండి రూ.96 వేల కోట్ల ఆర్థిక సాయం కోరిన పాకిస్థాన్

గత నాలుగేళ్లుగా పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్, తన కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి అమెరికా తలుపు తట్టింది. ఐదేళ్ల కాలపరిమితితో కూడిన ‘ద్వైపాక్షిక మార్పిడి స్థిరీకరణ మద్దతు సౌకర్యం’ (ESF) కింద దాదాపు 10 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.96 వేల కోట్లు) ఆర్థిక సహాయం అందించాల్సిందిగా అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్‌కు ఇస్లామాబాద్ విజ్ఞప్తి చేసింది. ఇటీవల అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరిగిన వివాదంలో శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించడం ద్వారా దౌత్యపరంగా పెరిగిన తన ప్రాధాన్యతను వాడుకుని, ఈ భారీ నిధులను రాబట్టాలని పాక్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

నగదు కొరతతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు ఈ అమెరికా ఆర్థిక ప్యాకేజీ గనుక అందితే అది ఒక పెద్ద ఊరటగా మారుతుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రోగ్రామ్‌కు అనుగుణంగా కఠినమైన పన్నులు, పొదుపు చర్యలు పాటిస్తున్నప్పటికీ, ఈ అదనపు అమెరికా నిధులు పాక్ విదేశీ మారకపు నిల్వలను (Forex Reserves) బలోపేతం చేయడమే కాకుండా రూపాయి విలువ పతనాన్ని అడ్డుకుంటాయి. ఈ చర్చలపై ఇరు దేశాలూ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, పాక్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ ఈ వారంలో అమెరికా వాణిజ్య మంత్రితో భేటీ అయి, భౌగోళిక రాజకీయ పరిణామాల వల్ల తమ ఆర్థిక రంగం ఎంత బలహీనపడిందో వివరించి పెట్టుబడులు, నిధుల కోసం మద్దతు కోరారు.

ప్రస్తుతం పాకిస్థాన్ 7 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్ ప్యాకేజీ షరతులకు లోబడి నడుస్తోంది. 2023లో డిఫాల్ట్ (దివాలా) అయ్యే ముప్పు నుండి తృటిలో తప్పించుకున్న పాక్.. చైనా, సౌదీ అరేబియా వంటి మిత్రదేశాలు ఇచ్చే రోల్‌ఓవర్ రుణాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా ట్రెజరీ కరెన్సీ స్థిరీకరణ నిధి ద్వారా ఇచ్చే ‘ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫెసిలిటీస్’ను పాక్ ఆశిస్తోంది. గతంలో 2002లో ఉరుగ్వేకు, ఇటీవల అర్జెంటీనాకు ఇటువంటి ప్రత్యేక అసాధారణ ఆర్థిక సహాయాన్ని అమెరికా అందించగా, ఇప్పుడు అదే బాటలో 2026 చివరి నాటికి తమ రిజర్వులను 20 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో పాకిస్థాన్ ఈ ప్రతిపాదనను వాషింగ్టన్ ముందు ఉంచింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు