మంత్రి గారూ.. మీరేమైనా దేవుడనుకుంటున్నారా?: నీట్ నిరసనలపై సింగర్ అరిజిత్ సింగ్ తీవ్ర ఆగ్రహం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET) పరీక్షల అక్రమాలపై కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అరిజిత్ సింగ్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన నిరసనలకు ఆయన తన మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “హలో మంత్రి గారూ, మీరేమైనా దేవుడనుకుంటున్నారా?” అంటూ పాలకులను సూటిగా ప్రశ్నించారు.

నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలకు నైతిక జవాబుదారీతనం వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ప్రస్తుతం నిరాహార దీక్షలు చేస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు జరిపిన లాఠీచార్జ్ మరియు బలప్రయోగ చర్యలను అరిజిత్ సింగ్ తీవ్రంగా తప్పుపట్టారు. భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన యువ నిరసనకారుల పట్ల ప్రభుత్వం కఠినంగా కాకుండా సానుభూతితో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు.

పోలీసుల చర్యలను ఖండిస్తూ.. అక్కడ విద్యార్థులను కొడుతుంటే చూస్తూ ఊరుకుంటున్న మంత్రులు, నాయకులను ఆయన తీవ్రంగా హెచ్చరించారు. “అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మిమ్మల్ని మీరు దేవుళ్లుగా భావిస్తున్నారా? ప్రజలంతా ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకుంటారు, మార్పు ఒక్కటే జగతిలో శాశ్వతం” అని అరిజిత్ సింగ్ పేర్కొన్నారు. అరిజిత్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలతో నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్న పోరాటానికి సెలబ్రిటీల నుండి మరింత మద్దతు పెరిగినట్లయింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు