‘పల్లె వీక్షణ’తో గ్రామీణ సమస్యలకు వేగవంతమైన పరిష్కారం: కలెక్టర్ హిమాన్షు శుక్ల

గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించడమే ‘పల్లె వీక్షణ’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. వెంకటాచలం మండల కేంద్రంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు, అంగన్‌వాడీ కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మరియు వీరన్న కనుపూరు చెరువు పునరుద్ధరణ పనులను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు.

అనంతరం నిర్వహించిన గ్రామసభలో ప్రజల నుంచి రెవెన్యూ, సాగునీరు, వైద్యం, గృహ నిర్మాణం తదితర అంశాలపై అర్జీలను స్వీకరించారు. పల్లె వీక్షణలో అందిన ప్రతి వినతిని ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేసి 30 రోజుల్లో పరిష్కరించేలా పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, అధికారులే నేరుగా గ్రామాలకు వచ్చి సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి రహదారుల అభివృద్ధితో పాటు ఇరిగేషన్ రంగానికి కూడా నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా అర్హుల ఖాతాల్లో నిధులు జమయ్యాయని, గతంలో భూ రీ-సర్వేలో ఏర్పడిన సమస్యలను పూర్తిగా పరిష్కరించి నిజమైన రైతులు, పేదలకు న్యాయం జరిగేలా అధికారులు కృషి చేయాలని ఆయన కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు