ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని మూడు జిల్లాలను అనుసంధానించే అత్యంత ప్రాధాన్యత కలిగిన రైల్వే ప్రాజెక్ట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బళ్లారి – గుంతకల్ రైల్వే డివిజన్లో రూ.1,240 కోట్ల అంచనా వ్యయంతో 3వ, 4వ లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ భారీ ప్రాజెక్ట్ 2028-29 నాటికి పూర్తి కానుందని అంచనా వేయగా, దీని ద్వారా ఇరు రాష్ట్రాల్లో అదనంగా మరో 46 కిలోమీటర్ల రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది.
‘పీఎం-గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’ కింద రూపోందించిన ఈ ప్రాజెక్ట్ వల్ల దాదాపు 99 గ్రామాల్లోని సుమారు 7 లక్షల మంది జనాభాకు మెరుగైన రైలు సౌకర్యం లభించనుంది. ట్రాక్ సామర్థ్యం పెరగడం వల్ల ప్రయాణికుల, సరుకు రవాణా రైళ్లు వేర్వేరుగా సాఫీగా సాగి, రద్దీ తగ్గి ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఇనుప ఖనిజం, బొగ్గు, సున్నపురాయి, ఉక్కు, ఎరువులు వంటి సరుకుల రవాణా వేగవంతం కానుండటంతో ఏటా అదనంగా 16.22 మిలియన్ టన్నుల రవాణా సామర్థ్యం పెరుగుతుంది. పర్యావరణపరంగా కూడా ఈ ప్రాజెక్ట్ వల్ల ఏటా 1.32 కోట్ల లీటర్ల ఇంధన దిగుమతి భారం తగ్గడంతో పాటు 6.67 కోట్ల కిలోల కర్భన ఉద్గారాలు అదుపులోకి వస్తాయి, ఇది ఏకంగా 27 లక్షల చెట్లను నాటడంతో సమానం.
‘భవ్య రసాయన్’ పథకానికి గ్రీన్ సిగ్నల్: ఈ రైల్వే ప్రాజెక్ట్‌తో పాటు దేశీయ రసాయన రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ‘భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన రసాయన్’ (భవ్య – రసాయన్) పథకానికి ఆమోదం తెలిపింది.
-
2026-27 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఈ పథకం కోసం మొత్తం రూ.3,030 కోట్లు కేటాయించారు.
-
ఈ నిధుల్లో మూడు ప్రత్యేక రసాయన పార్కుల లోపల ఉమ్మడి మౌలిక సదుపాయాల కోసం రూ.3,000 కోట్లు, పరిపాలనా వ్యయం కోసం రూ.30 కోట్లు వినియోగిస్తారు.
-
2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్ల పాటు సాగే ఈ పథకం కింద ప్రతి పార్కుకు కేంద్ర ప్రభుత్వం రూ.1,000 కోట్ల వరకు గ్రాంటును అందజేస్తుంది, కాగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా కనీసం రూ.500 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది.









