భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ: ఏర్పాట్లపై మంత్రి లోకేశ్ నేతృత్వంలో సమీక్ష

ఆగస్టు 1న విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రుల బృందం ఆదేశించింది. మంత్రి నారా లోకేశ్ అధ్యక్షతన ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా, విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం తీసుకుంటున్న చర్యలను అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. బహిరంగ సభా ప్రాంగణం, వేదిక నిర్మాణం, భద్రతాపరమైన అంశాలు, గ్యాలరీలు, జన సమీకరణ, పార్కింగ్, రవాణా, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి ఏర్పాట్లపై చర్చించారు. ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పెద్ద సంఖ్యలో విద్యార్థినులతో థింసా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయాలని, అలాగే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరకు కాఫీ విశిష్టతను తెలిపేలా ప్రత్యేకంగా ఒక స్టాల్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి, అల్లూరి సీతారామరాజు విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మంత్రుల సంఘం అధికారులకు స్పష్టం చేసింది. ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు ప్రధాని పర్యటన నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని పలు సూచనలు చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు