నేపాల్‌లో భారత కరెన్సీపై పదేళ్ల ఆంక్షలకు తెర.. రూ.500 నోట్లకు గ్రీన్ సిగ్నల్

భారత కరెన్సీ వినియోగంపై నేపాల్ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న ఆంక్షలను సడలిస్తూ, రూ. 200, రూ. 500 విలువైన భారత కరెన్సీ నోట్లను తమ దేశంలోకి తీసుకురావడానికి, అలాగే తిరిగి తీసుకెళ్లడానికి అధికారికంగా అనుమతి ఇచ్చింది. భారతీయులు, నేపాల్ పౌరులు ఇరు దేశాల మధ్య ప్రయాణించేటప్పుడు గరిష్టంగా రూ. 25,000 పరిమితికి లోబడి ఈ నోట్లను తమ వెంట ఉంచుకోవచ్చని స్పష్టం చేసింది. 2016లో భారత్ చేపట్టిన పెద్ద నోట్ల రద్దు (డెమోనిటైజేషన్) తర్వాత విధించిన కఠిన నిబంధనలకు ఈ తాజా నిర్ణయంతో పూర్తిగా తెరపడినట్లయింది.

నేపాల్ రాష్ట్ర బ్యాంక్ (NRB) ఈ నిబంధనలపై స్పష్టతనిస్తూ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. 2016 నవంబర్ 9 తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించిన కొత్త రూ. 200, రూ. 500 నోట్లకు మాత్రమే ఈ సడలింపు వర్తిస్తుందని, పాత రూ. 500, రూ. 1,000 నోట్లపై నిషేధం యథావిధిగా కొనసాగుతుందని ఎన్ఆర్‌బీ స్పష్టం చేసింది. ఎన్ఆర్‌బీ ప్రతినిధి గురు ప్రసాద్ పౌడెల్ ఈ వివరాలపై మాట్లాడుతూ, నేపాల్ పౌరులు భారత్ నుంచి మాత్రమే ఈ కరెన్సీని దేశంలోకి తీసుకురావాలని, నేపాల్ నుంచి భారత్‌కు తప్ప మరే ఇతర మూడో దేశానికీ దీనిని తీసుకెళ్లకూడదని నిబంధన విధించారు.

ఈ తాజా నిర్ణయంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సరిహద్దు వ్యాపారం మరియు పర్యాటకరంగం మరింత సులభతరం కానున్నాయి. భారత్, నేపాల్ మధ్య స్వేచ్ఛాయుత సరిహద్దు (Open Border) ఉండటంతో పాటు వాణిజ్యపరంగా బలమైన సంబంధాలు ఉన్నాయి. గతంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత కేవలం రూ. 100, అంతకంటే తక్కువ విలువైన నోట్లను మాత్రమే అనుమతించడంతో ప్రయాణికులు, సరిహద్దు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మొత్తం నగదు పరిమితి రూ. 25,000గా ఉంచి, అధిక విలువ కలిగిన నోట్లను అనుమతించడం వల్ల సరిహద్దు లావాదేవీలు వేగవంతమై ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు