ఏఐ మన విద్యా వ్యవస్థ గొంతు కోస్తోంది.. డిగ్రీలు కాగితాలుగానే మిగిలిపోతాయి: రాంగోపాల్ వర్మ ఆందోళన

దేశంలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దులు, విద్యార్థుల ఆత్మహత్యల కంటే కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) వల్ల విద్యా రంగానికి ఎదురవుతున్న ముప్పే అత్యంత ప్రమాదకరమైనదని ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ వంటి సమస్యల వల్ల విద్యా వ్యవస్థకు రక్తస్రావం మాత్రమే జరుగుతుంటే, ఏఐ మాత్రం ఆ వ్యవస్థ గొంతు కోసేస్తోందని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కష్టపడి చదువుకుంటే సుఖంగా జీవించవచ్చు’ అనే పాతకాలపు నమ్మకాన్ని ఏఐ పూర్తిగా తుడిచిపెట్టేసిందని, మార్కులు, డిగ్రీలు, కంఠస్థం చేసే సామర్థ్యం కంటే వేగంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మారడమే ఇప్పుడు అత్యంత ముఖ్యమని ఆర్జీవీ స్పష్టం చేశారు.

ప్రస్తుత రోజుల్లో ఏఐ వినియోగాన్ని నేర్పించని ఏ చదువు అయినా వ్యర్థమేనని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధస్సు సహాయంతో ఒక్క వ్యక్తి మాత్రమే డాక్టర్, లాయర్, ఇంజనీర్, సీఏ వంటి బహుముఖ పాత్రలను సాధారణ మానవుల కంటే అత్యంత వేగంగా, కచ్చితత్వంతో నిర్వర్తించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటున్నాడని చెప్పారు. ఈ విప్లవాత్మక మార్పుల వల్ల రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్, మెడిసిన్, లా, ఎంబీఏ చదివే విద్యార్థులు సంపాదించే డిగ్రీలు కేవలం కాగితాలుగానే మిగిలిపోతాయని, మార్కెట్‌లో ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవుతాయని ఆయన హెచ్చరించారు.

భవిష్యత్తులో ఏఐని సమర్థవంతంగా ఉపయోగించే వారిగా మారతారా? లేదా దానివల్ల ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారా? అనేదే ఇప్పుడు మన ముందున్న ఏకైక ఎంపిక అని ఆర్జీవీ పేర్కొన్నారు. సమాజంలో రాబోతున్న ఈ పెను మార్పులను, చేదు వాస్తవాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు త్వరితగతిన గ్రహించి మేల్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. టెక్నాలజీ రంగంలో వస్తున్న ఈ మార్పులపై విద్యార్థులకు ఇప్పటి నుంచే సరైన అవగాహన కల్పించకపోతే విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు