రాజకీయాల్లోకి ధనుష్?.. అభిమానుల్లో ఆసక్తి

ప్రముఖ బహుముఖ ప్రజ్ఞాశాలి, సినీ నటుడు ధనుష్ తన రాజకీయ ప్రవేశంపై మరోసారి ఆసక్తికర సంకేతాలు ఇచ్చారు. అభిమానుల ఐక్యతను కేవలం సినిమా వేడుకలకే పరిమితం చేయకుండా, ప్రజా సేవ వైపు మళ్లించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇంతమంది ఒకేచోట చేరడం వెనుక గొప్ప శక్తి ఉందని, కేవలం ఆడియో వేడుకలు, ఫ్యాన్స్ మీట్స్‌కే పరిమితం కాకుండా పౌరులకు తోచిన సాయం అందించి సంక్షేమ కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ‘దళపతి’ విజయ్ బాటలోనే ధనుష్ కూడా రాజకీయాల్లోకి రానున్నారంటూ అభిమానులు గట్టిగా చర్చించుకుంటున్నారు.

ఇదే వేదికపై తన సినిమాలకు వచ్చిన జాతీయ అవార్డుల విమర్శల పైనా ధనుష్ స్పష్టతనిచ్చారు. 2024లో తన దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్’ కంటే మెరుగైన తమిళ సినిమాలు మరిన్ని వచ్చాయని ఆయన నిజాయితీగా అంగీకరించారు. అయితే, ఒకే ఏడాది ఒకే తమిళ నటుడికి రెండు జాతీయ అవార్డులు దక్కడం గర్వకారణమని, దాన్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని కోరారు. కాగా, ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రానికి ధనుష్‌కు స్పెషల్ మెన్షన్ రాగా, ‘రాయన్’ ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. విమర్శలను సైతం హుందాగా స్వీకరిస్తూ ఆయన మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

తమిళ చిత్రసీమలో అగ్ర నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాకపోయినప్పటికీ, ధనుష్ తాజా వ్యాఖ్యలు సరికొత్త సమీకరణాలకు తెరలేపాయి. విజయ్ తన రాజకీయ పార్టీ ‘టీవీకే’ (TVK) ప్రకటించడానికి ముందు ఇలాగే తన సంక్షేమ సంఘాల ద్వారా సేవా కార్యక్రమాలు విస్తృతం చేసిన విషయాన్ని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ధనుష్ కూడా అదే వ్యూహంతో ముందుకు సాగుతున్నారని, త్వరలోనే ఆయన నుంచి కొత్త రాజకీయ పార్టీ ప్రకటన రావచ్చని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విద్యావంతుడైన ధనుష్ వంటి నాయకుడు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు