CJP పార్టీ రూట్ మార్చింది.. తెలుగు రాష్ట్రాల్లోనూ సత్తా చూపిస్తామంటూ ఎంట్రీ!

సోషల్ మీడియా వేదికగా ఆవిర్భవించిన ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (CJP) ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఢిల్లీ కేంద్రంగా విద్యార్థుల మద్దతుతో హోరెత్తించిన నిరసనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా ఒత్తిడి తెచ్చిన ఈ పార్టీ, తమ పోరాటం ఇక్కడితో పూర్తి కాలేదని స్పష్టం చేసింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించి అందరి దృష్టినీ ఆకర్షించింది. దేశంలో ప్రతిపక్షాలను, ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తూ బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు కుట్రలు చేస్తోందని సీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్న తెలుగు రాష్ట్రాల యువ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ‘జెన్-జీ’ (Gen-Z) తరంగమని స్పష్టం చేసిన నాయకులు, తమ పార్టీ ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లోకి రాదని, కేవలం ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉద్యమానికి ఉస్మానియా (OU), కాకతీయ (KU), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) విద్యార్థులు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. ఇటీవల హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నీట్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణలోని ఏ ఒక్క ప్రధాన రాజకీయ పార్టీ నేత కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం శోచనీయమని సీజేపీ ప్రతినిధులు మండిపడ్డారు. హెచ్‌సీయూ భూములు, కేబీఆర్‌ పార్కు అడవుల పరిరక్షణ కోసం ఇప్పటికే తాము క్షేత్రస్థాయిలో పోరాటం చేశామని గుర్తుచేసిన నేతలు, భవిష్యత్తులోనూ విద్యా, వైద్య రంగాల్లో జరిగే అన్యాయాలపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించారు.

తాము నిర్వహిస్తున్న ప్రజా ఉద్యమాలకు మద్దతుగా నిలిచేవారు, తమ పోరాటంలో భాగస్వాములు కావాలనుకునే వారు 7277773355 నంబరుకు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని సీజేపీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. సోషల్ మీడియా డిజిటల్ ఉద్యమాల ద్వారా ఢిల్లీ వేదికగా సాధించిన విజయం తర్వాత, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సరికొత్త పార్టీ విస్తరణకు ఎలాంటి మద్దతు లభిస్తుందనేది ప్రస్తుత రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు