పవిత్ర గంగానదిపై ప్రయాణిస్తూ చికెన్ తిన్నారనే నెపంతో పౌరులను అరెస్ట్ చేయడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భుయాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగానదిపై మాంసాహారం తినకూడదని ఏ చట్టప్రకారం నేరమవుతుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఏ చట్టమూ నిషేధించని విషయాన్ని నేరంగా పరిగణించి, బాధ్యులను అరెస్ట్ చేయడమే కాకుండా మూడు నెలల పాటు బెయిల్ కూడా రాకుండా నిరాకరించడం ఎంతవరకు సమంజసమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక హక్కులను వినియోగించుకుంటున్న పౌరులపై లేని నేరాలను ఆపాదిస్తూ పోలీసులు ఏ విధంగా వేధిస్తున్నారో చెప్పడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనమని జస్టిస్ భుయాన్ పేర్కొన్నారు.
గతంలో వారణాసిలోని గంగానదిలో ఒక బోటుపై రంజాన్ ఉపవాసం ముగిసిన అనంతరం కొంతమంది బోటు సిబ్బంది చికెన్ తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏకంగా 14 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. శనివారం భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ (NLIU) నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జస్టిస్ ఉజ్వల్ భుయాన్ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎలాంటి చట్టబద్ధమైన ఆధారం లేకుండా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా నిరసనలు తెలిపే పౌరుల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం అణచివేస్తుండటంపై కూడా జస్టిస్ భుయాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో జరుగుతున్న ఊచకోతలకు నిరసనగా, అక్కడి ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు ముంబైలోని శివాజీ పార్క్‌లో ఒక వర్గం ప్రజలు నిరసన తెలపాలని భావించారని గుర్తుచేశారు. అయితే ప్రభుత్వం దానికి అనుమతి నిరాకరించడంతో వారు బాంబే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరికాదని, పౌర హక్కుల పరిరక్షణలో న్యాయవ్యవస్థ పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు.









