మతం మారితే ‘ఎస్సీ’ హోదా కోల్పోయినట్లే: మరోసారి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గానికి చెందిన వ్యక్తి ఇతర మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా తక్షణమే రద్దవుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను కాదని క్రిస్టియానిటీ లేదా ఇతర మతాలను స్వీకరించిన వ్యక్తులకు ఎస్సీ రిజర్వేషన్లు, కుల ధ్రువీకరణ పత్రాలు చెల్లవంటూ గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించి, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి పొరపాటు లేదని వ్యాఖ్యానిస్తూ పునఃపరిశీలన పిటిషన్‌ను తోసిపుచ్చింది.

1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వుల ప్రకారం… హిందూ, సిక్కు, బౌద్ధ మతస్థులు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని, మతం మారిన మరుక్షణమే ఎస్సీ హోదా, దాని ఆధారిత ప్రయోజనాలు ముగుస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా తిరిగి ఎస్సీ హోదాను పొందాలంటే… రాజ్యాంగం నిర్దేశించిన మూడు ప్రధాన నిబంధనలకు కట్టుబడి ఉండాలని పేర్కొంది. అవి: పుట్టుకతో ఎస్సీ అయి ఉండటం, స్వచ్ఛందంగా తిరిగి సొంత మతంలోకి రావడం, మరియు మూల కుల సమాజం వారిని తిరిగి ఆమోదించడం. ఈ మూడు షరతులు నెరవేరితేనే సదరు వ్యక్తికి తిరిగి పాత హోదా లభిస్తుందని న్యాయస్థానం వివరించింది.

సుప్రీంకోర్టు వెలువరించిన ఈ కీలక తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వేషన్ విధానాలు, మత మార్పిడి వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా మతం మారిన తర్వాత కూడా రిజర్వేషన్ ఫలాలను పొందుతున్న వారి ధ్రువీకరణ పత్రాల చెల్లుబాటుపై ఇది గట్టి ప్రభావం చూపే అవకాశం ఉందని చట్ట నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తాజా స్పష్టీకరణతో మత మార్పిడి మరియు కుల ఆధారిత రిజర్వేషన్ల చట్టాలపై సుదీర్ఘకాలంగా నడుస్తున్న పలు వివాదాలకు చట్టపరమైన ముగింపు లభించినట్లయింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు