తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన కేసులో నిందితుడిగా ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు బుధవారం ఉప్పరపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అరెస్ట్ అనంతరం నిబంధనల ప్రకారం ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత భారీ భద్రత నడుమ పోలీసులు ఆయనను కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం కేసును పరిశీలించి, తదుపరి ప్రక్రియ కోసం కీలక ఆదేశాలు జారీ చేసింది.
కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు బుధవారం ఉదయం అశోక్‌నగర్‌లో ‘సీన్ రీకన్స్ట్రక్షన్’ ప్రక్రియను నిర్వహించారు. ఉదయ్ కృష్ణారెడ్డిని ఆయన నివసిస్తున్న అద్దె గదికి తీసుకెళ్లి, ఘటన జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. నేరం జరిగిన స్థలంలో ఉన్న పరిసరాలను నిశితంగా తనిఖీ చేసి, ఈ కేసుకు సంబంధించిన పలు కీలక సాక్ష్యాధారాలు మరియు డిజిటల్ ఆధారాలను రికార్డు చేసుకున్నారు.
న్యాయస్థానంలో జరిగిన విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) న్యాయమూర్తి దృష్టికి ఒక ముఖ్యమైన సాంకేతిక అంశాన్ని తీసుకెళ్లారు. ఈ కేసులో బాధితురాలికి చట్టప్రకారం ముందస్తు నోటీసులు జారీ చేయాల్సి ఉందని పీపీ కోర్టుకు విన్నవించారు. పీపీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. బాధితురాలికి తక్షణమే నోటీసులు ఇవ్వాలని పోలీసు అధికారులను ఆదేశిస్తూ, తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.









