రైతుల్లో చిగురించిన ఆశలు: ఎల్నినో ప్రభావం మరియు తీవ్ర వర్షభావం వల్ల ఈ ఏడాది పంటల పరిస్థితిపై తీవ్ర ఆందోళన చెందుతున్న అన్నదాతల్లో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు కొత్త ఆశలను నింపుతోంది. కృష్ణా నది ఎగువ పరివాహక ప్రాంతాలైన కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాలు భారీ వర్షాల కారణంగా నిండుకుండలా మారాయి. దాంతో అక్కడి నుంచి కృష్ణా జలాలను భారీగా దిగువకు విడుదల చేస్తుండటంతో జూరాల ప్రాజెక్టు వైపు కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది.
కళకళలాడుతున్న జూరాల ప్రాజెక్టు: కర్ణాటక ప్రాజెక్టుల నుంచి గత మూడు రోజులుగా వస్తున్న వరద ఉద్ధృతితో జూరాల జలాశయం పూర్తిగా కళకళలాడుతోంది. గురువారం ఉదయానికి జూరాల వద్ద ఇన్ఫ్లో (వరద ప్రవాహం) ఏకంగా 80,000 క్యూసెక్కులుగా నమోదైంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు జూరాల ప్రాజెక్టుకు సంబంధించిన 10 గేట్లను పైకి ఎత్తి నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. దీనితో పాటు జలవిద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ ద్వారా మరో 47,000 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపుతున్నారు.
శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద: జూరాల నుంచి విడుదల చేసిన వరద నీటితో శ్రీశైలం జలాశయానికి ప్రవాహం భారీగా కొనసాగుతోంది. ప్రస్తుతం జూరాల నుంచి శ్రీశైలానికి 79,403 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం ఉదయం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయం నీటి మట్టం 824.80 అడుగులుగా నమోదు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 44.6090 టీఎంసీలుగా ఉందని అధికారులు వెల్లడించారు. కాగా, శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తిని ఇంకా ప్రారంభించలేదని సమాచారం.









