ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తూ, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేసే పలు కీలక ప్రాజెక్టులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన రేపు (శనివారం) ప్రారంభించనున్నారు. ఈ విమానాశ్రయానికి సంబంధించిన ఆకర్షణీయమైన చిత్రాలను పంచుకున్న ప్రధాని, దీనిని ఆధునిక మరియు భవిష్యత్ అవసరాలకు ప్రతిరూపంగా అభివర్ణించారు.
భోగాపురం విమానాశ్రయం సుస్థిరత, ఇంధన సామర్థ్య సూత్రాలను పాటిస్తూ అత్యద్భుతంగా రూపుదిద్దుకుందని, ఇది ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనెక్టివిటీ, వాణిజ్యం మరియు పర్యాటక రంగాలను గణనీయంగా పెంచుతుందని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. విమానాశ్రయంతో పాటు సాంకేతిక రంగానికి ఊతమిచ్చేలా భోగాపురంలోనే నిర్మించనున్న ‘ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టు’కు, అలాగే రాయలసీమ ప్రాంతంలో ఇంధన వనరుల పెంపునకు దోహదపడే ‘కర్నూలు-IV పునరుత్పాదక ఇంధన జోన్ (ఆర్ఈజెడ్)’ మొదటి దశ అనుసంధాన ట్రాన్స్మిషన్ వ్యవస్థకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
మరోవైపు రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు వీలుగా పూర్తయిన పలు జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. వీటిలో ఎన్ హెచ్-365బీజీ పరిధిలోని రేచెర్ల – గురువాయిగూడెం మధ్య నాలుగు వరుసల రహదారి, గురువాయిగూడెం – దేవరపల్లి సెక్షన్లతో పాటు ఎన్ హెచ్-67పై నిర్మించిన తాడిపత్రి బైపాస్ రోడ్లు ఉన్నాయి. విమానయానం, సాంకేతికత, పునరుత్పాదక ఇంధనం, రహదారి రవాణా వంటి కీలక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ప్రగతికి సరికొత్త బూస్టింగ్ ఇస్తాయని మోదీ స్పష్టం చేశారు.









