రష్యా-ఉక్రెయిన్ యుద్ధ బాధితులకు సుప్రీంకోర్టు అండ: తక్షణమే న్యాయం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన మరియు అదృశ్యమైన భారతీయుల కుటుంబాలకు తక్షణమే న్యాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. బాధిత కుటుంబాల ఆవేదనను పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఆధ్వర్యంలో సమగ్ర చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి, వారి సందేహాలను నివృత్తి చేయడానికి విదేశీ వ్యవహారాల శాఖలో వెంటనే ఒక నోడల్ అధికారిని నియమించాలని, బాధితుల వివరాలను స్థానిక భాషల్లోనే కుటుంబాలకు తెలియజేయాలని ఆదేశించింది.

యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇండియాలోని బాధిత కుటుంబాల డీఎన్‌ఏ (DNA) నమూనాలను సేకరించి, రష్యాలో లభించిన మృతదేహాల డీఎన్‌ఏతో సరిపోల్చాలని కోర్టు పేర్కొంది. గుర్తింపు పూర్తయిన తర్వాత భౌతికకాయాలను లేదా అస్థికలను కుటుంబ సభ్యులకు సురక్షితంగా అందజేసి, అంత్యక్రియలు సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించింది. నష్టపరిహారం ప్రక్రియ ఆలస్యమైనంత మాత్రాన మృతదేహాల అప్పగింతలో ఎలాంటి జాప్యం జరగకూడదని సుప్రీంకోర్టు గట్టిగా తేల్చిచెప్పింది.

భారత బాధితులకు రావలసిన నష్టపరిహారాన్ని ఇండియాలోని రష్యా రాయబార కార్యాలయం నుండి సేకరించి, విదేశీ వ్యవహారాల శాఖ ద్వారానే నేరుగా అందజేయాలని కోర్టు సూచించింది. బాధిత కుటుంబాలకు చట్టపరమైన సాయాన్ని అందించేందుకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) పూర్తి స్థాయిలో సహకరించాలని కోరింది. 2024, 2025లలో రష్యాకు వివిధ వర్క్ వీసాలపై వెళ్లిన అనేక మంది భారతీయులను దగా చేసి, బలవంతంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ముందువరుస పోరాటాలకు ఉపయోగించుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో సమాచారం లేక తల్లడిల్లుతున్న కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ కీలక తీర్పు వెలువడింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు